వనపర్తి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఎక్కువ నీటిని తరలించుకుపోతున్న విషయం రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాలేదా అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ మాజీలు విహారయాత్రలు చేస్తూ పబ్లిసిటీ కోసం తప్పులు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడితే ఉరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నందున బాధ్యతాయుతంగా సమాధానమిస్తున్నామని.. హద్దులు దాటితే కాంగ్రెస్ కార్యకర్తలే సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జూరాల ప్రధాన కాల్వ, రాజీవ్ భీమాఫేజ్–2, కేఎల్‌ఐ కింద నియోజకవర్గంలో 90,741 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని.. ఇవన్నీ 2014కు ముందు కాంగ్రెస్‌పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు కావా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చారో రైతులకు లెక్కలు చెప్పాలని.. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్దమేనంటూ బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన బీఆర్‌ఎస్ నాయకులు 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు, ఇతర పెండింగ్ బిల్లులకు రూ.4 వేల కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. స్థానికంగా చర్చించడం చేతగాక సీఎంను విమర్శించడం పనిగా పెట్టుకొన్నారని, మాజీ మంత్రి కేటీఆర్ మెప్పు కోసం అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 1న ఎల్లూరు, ఆగస్టు 2న సింగోటం–జొన్నలబొగుడ, ఆగస్టు 3న గుడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని వదిలామని వివరించారు. డబుల్ ఓట్లను తొలగించడంతో వనపర్తి, పెబ్బేరు పట్టణాల్లో ఓట్ల సంఖ్య తగ్గిందని, మొత్తంగా నియోజకవర్గంలో 86 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. నెలాఖరులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లా పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్‌ఏలు సమర్థవంతంగా పని చేశారని డీసీసీ అధ్యక్షుడు ప్రశంసించారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపునిస్తామని తెలిపారు. సమావేశంలో పుర చైర్‌పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.


