● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం
● అవినీతి కూడా ప్రధాన సమస్య
● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి
● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.
79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత
ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య?


