కొత్తకోట రూరల్: ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయంలో ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సీఓ) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, స్టాక్ బోర్డులు, ధరల పట్టికలను పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ వివరాలను నమోదు చేయకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులకు క్షేత్ర ప్రదర్శనలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, పంటల్లో సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే
విక్రయించాలి..
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ నిబంధనలు, ధరల ప్రకారమే ఎరువులు విక్రయించాలని డీఏఓ అంజనేయులు అన్నారు. శుక్రవారం సోళీపురం, ఖిల్లాఘనపురంలోని ఎరువుల దుఖాణాలను మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు, ఈపాస్ యంత్రాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ బోర్డులు పరిశీలించారు. జిల్లాలో సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని తెలిపారు. ఎవరైన డీలర్లు ఎక్కువ ధరలకు, నకిలీ ఎరువులు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.


