● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
● పీజీఆర్‌ఎస్–రెవెన్యూ క్లినిక్‌లో
210 వినతుల స్వీకరణ
విజయనగరం గంటస్తంభం: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్),రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్–రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 210 వినతులు స్వీకరించగా..అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే 95 అర్జీలు ఉన్నాయి. భూ, సర్వే సమస్యలను కేవలం కార్యాలయం స్థాయి నివేదికలకే పరిమితం చేయకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిష్కరించి, ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చూట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు.
మాట్లాడాకే ఎండార్స్‌మెంట్..
పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీదారుతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి. వారితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం కాగితాలపై నివేదికలు ఇవ్వకుండా సమస్య వాస్తంగా పరిష్కారమైందా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు.
1100 ఫిర్యాదులపైనా దృష్టి
1100 టోల్‌ఫ్రీ సేవల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు 36 ఫిర్యాదులు
విజయనగరం టౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి చట్టపరిధిలో న్యాయం చేయడానికి గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించి బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను విని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలకు తక్షణ పరిష్కారమందించాలని సూచించారు. గ్రీవెన్స్‌సెల్‌లో భాగంగా 36 పిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించి 12, కుటుంబ తగాదాలకు సంబంధించి ఆరు, చీటింగ్‌కు సంబంధించి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.


