● లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.రామారావు
● మండలంలోని పలు రేషన్ దుకాణాల తనిఖీ
రామభద్రపురం: వినియోగదారులకు రేషన్ పంపిణీలో తూకాల్లో తేడాలొస్తే చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.రామారావు హెచ్చరించారు. రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు కోత విధిస్తూ డీలర్లు ఇస్టానుసారం పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారనే అంశంపై ఈ నెల 10వ తేదీన ‘కేజీకి 900 గ్రాములే’..! శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. ఆ కథనంపై స్పందించిన లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మనోహర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కంట్రోలర్ వి.రామారావు, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ బి.మధు సంతోష్‌లతో కూడిన బృందం మండలంలోని ఆరికతోట, ముచ్చర్లవలస, మండలకేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. తూనికలు,కొలతలు పరికరాల పనితీరు, నిబంధనల అమలును పరిశీలించారు. అలాగే డీలర్లకు లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు నష్టం జరగకుండా రేషన్ డీలర్లు తూకాల్లో తేడా లేకుండా బియ్యం తూకం వేసి ఇవ్వాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు జిల్లాలోని వివిధ వ్యాపార రంగాలపై లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా విస్తృత తనిఖీల్లో భాగంగా 308 కేసులు నమోదు చేసి రూ.13,36,00 రాజీ రుసుం వసూలు చేశామన్నారు. అలాగే ఇందులో భాగంగా 8 రేషన్ దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.25 వేలు రాజీ రుసుం వసూలు చేశామన్నారు. తూనికలు, కొలతల్లో మోసాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడైనా తూనికలు, కొలతల్లో మోసాలు లేదా నిబంధన ఉల్లంఘనను గుర్తించినట్లయితే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.


