● ఒక్క కాల్ చేస్తే తక్షణమే పోలీసుల స్పందన
● బాధితులు సద్వినియోగం చేసుకోవాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం టౌన్: ప్రమాదాల్లో చిక్కుకున్నారా? అసాంఘిక శక్తుల కార్యకలాపాలను గమనించారా? ఎప్పుడైనా..ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలు. ఎందరికో సహాయపడినవారవుతారు. ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆరాచక శక్తులు చెలరేగిపోతున్నప్పుడు కంటపడితే ఉపేక్షించనక్కర్లేదు. వెంటనే డయల్ 112కి పోన్ చేసి వివరించండి ఇది పూర్తిగా ఉచిత సదుపాయం అంటోంది జిల్లా పోలీసు యంత్రాంగం. అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి. అప్పుడే పూర్తిస్థాయిలో ప్రమాదాలను అరికట్టగలుగుతాం. నేరరహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు తమవంతు బాధ్యతగా సహకరించాలి. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, అనధికార బెల్ట్ దుకాణాలు, గంజాయి తదితర మాదక ద్రవ్యాల అమ్మకాలు..ఇలా ఏది కంటపడినా 112కి సమాచారమందించవచ్చు.
భారీగా ఫోన్‌కాల్స్.. కేసులు నమోదు
ఈ ఏడాది ఇప్పటివరకూ (జూలై 2026) మొత్తం 6889 ఫోన్‌కాల్స్112కి వచ్చాయి. వాటిపై 101 వరకూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మహిళలకు సంబంధించి 1642 కాల్స్, 305 ప్రమాదాలు, 29 ఆత్మహత్యలు, 2548 న్యూసెన్స్, 1586 ఇతర పబ్లిక్‌ను ఇబ్బందులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కాల్స్ వచ్చాయి.
సమాచారం తెలిస్తే .. సహకరించండి
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కి సమాచారమివ్వండి. వచ్చిన సమాచారం బట్టి దాడులు విస్తృతం చేస్తాం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. ఎటువంటి సమాచారమందించినా అప్రమత్తమవుతాం. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, బెల్ట్ దుకాణాలు, తదితర సమాచారన్నిచ్చి పోలీసులకు సహకరించండి
ఏఆర్ దామోదర్, ఎస్పీ, విజయనగరం


