గుర్ల: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్ల మండలంలోని కలవచర్లకు చెందిన గుమ్మిడి సూర్యనారాయణ (50) మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలవచర్లకు చెందిన సూర్యనారాయణ సముద్రపు చేపల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతిరోజూ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి చేపలు కొనుగోలు చేసి గుర్ల తీసుకువచ్చి చిరు వ్యాపారులకు అమ్ముతుంటాడు. రోజులోగానే చేపలు కొనుగోలు చేయడానికి వెళ్తుండగా ఎండాడ నుంచి ఫిషింగ్ హార్బర్ మధ్యలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సూర్యనారాయణను వెనుక నుంచి వస్తున్న కంటైనర్ బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సూర్యనారాయణ మృతితో కలవచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య సత్యవతి, కుమార్తె ధరణి, కుమారుడు సాయి శ్రీనివాస్ ఉన్నారు.
పొలంపనికి వెళ్లి మృత్యువాత
మక్కువ: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన మత్స జగదీశ్వరరావు(45) మంగళవారం పొలంపనులు చేస్తూ కుప్పకూలి మతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పొలంలో పంటకు నీరుకట్టుకుని వస్తానని జగదీశ్వరావు మంగళవారం ఉదయం ఇంటిలో చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 సమయం దాటుతున్నప్పటికీ భోజనానికి రాకపోవడంతో, కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, జగదీశ్వరరావు పొలంలో విగతజీవుడిగా పడి ఉన్నాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మతునికి భార్య సుజాత, పాప సంధ్య ఉన్నారు.
హైదరాబాద్‌లో చింతాడ వాసి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని చింతాడ గ్రామానికి చెందిన మరడాన వెంకటనాయుడు(53) హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లివద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. పాలప్యాకెట్ కోసం వెంకటనాయుడు తెల్లవారు జామున నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కొన్నేళ్లుగా సూరారంలో ఓ ప్రైవేట్ కంపెనీని నిర్వహిస్తున్న వెంకటనాయుడు అక్కడే స్థిరపడ్డాడు. వెంకటనాయుడుకు భార్య రాజేశ్వరి, కుమారులు నిఖిల్, వినయ్‌లు ఉన్నారు. ప్రమాదంపై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం నాటికి వెంకటనాయుడి భౌతిక కాయాన్ని స్వగ్రామం చింతాడకు తీసుకు వచ్చేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు.
నేడు దివ్యాంగుల క్రికెట్
క్రీడాకారుల ఎంపిక
విజయనగరం రూరల్: అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్– 2026 టోర్నమెంట్‌కు సంబంధించి డీసీసీఏపీ, డీఏసీఏ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ మజ్జి గణేష్, ఆర్గనైజర్ జి.నరేష్‌వర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలపారు. జిల్లా కేంద్రంలోని ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇంటి సమీపంలో ఉన్న ఎలైట్ క్రికెట్ అకాడమీ నెట్స్‌లో ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు వారి వ్యక్తిగత క్రికెట్ కిట్‌తో పాటు ఆధార్ కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం, యూడీఐడీ కార్డుల జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఎంపిక కమిటీకి అందించాలని సూచించారు. శారీరక దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేధింపుల కేసులో భర్తకు ఏడాది జైలుశిక్ష
పాలకొండ: భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.5వేలు జరిమానాను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ విధించారని ఎస్సై డోల వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మొద్దంశెట్టి ఈశ్వరరావుపై పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మొద్దం శెట్టి నాగమణి తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని నవంబర్ 18, 2019లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో పూర్తి ఆధారాలను సేకరించి కోర్టుకు అందించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధారాణి తమ వాదనలు వినిపించారు. నేరం రుజుం కావడంతో ముద్దాయికి పై విధంగా శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి మంగళవారం తీర్పు వెల్లడించారు.


