● స్కీమ్ వర్కర్ల ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
● కనీస వేతనాల కోసం కార్మికుల సమరం
● పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట
● సొమ్మసిల్లిన మహిళలు
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు సర్కారుపై అంగన్‌వాడీ, ఆశ, స్కీమ్ వర్కర్లు తిరుగుబాటు ప్రకటించారు. హామీల అమలులో అలసత్వం, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సమరభేరి మోగించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు గూడ్స్ షెడ్ కూడలి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశ, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నినదించారు. స్టీల్ ప్లాంట్, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశౠరు. ఆశ వర్కర్లకు రాత్రి డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. అధికారులకు గోడు వినిపించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశ వర్కర్లు సొమ్మసిల్లిపోయారు. సీఐటీయూ నాయకులు 13 మందిని పోలీసులు అరెస్టు చేసి డెంకాడ, విజయనగరం పట్టణ స్టేషన్లకు తరలించారు. ఈ ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, శ్రామిక మహిళా నాయకురాలు ఎం.ఉమామహేశ్వరి, సీఐటీయూ నాయకులు గౌరినాయుడు, పి.శంకరరావు, లక్ష్మి, ఎ.జగన్‌మోహన్‌రావు, రామారావు, వెంకటేష్, వీఆర్‌ఏలు, ఏఎన్‌ఎంలు, మున్పిపల్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, కాంట్రాక్ట్–ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు వేలాదిగా పాల్గొన్నారు.
ఆందోళనలో స్పృహతప్పి పడిపోయిన మహిళా కార్మికురాలికి నీళ్లు తాగిస్తున్న దృశ్యం
పోలీసుల నెట్టివేతతో కిందపడిపోయిన సీఐటీయూ నాయకుడు


