సాక్షిప్రతినిధి, విజయనగరం:
డీఎస్సీ అక్రమాలపై యువత సమరభేరి మోగించింది. ఉప్పెనగా ఉద్యమించింది. ప్రశ్నపత్రం లీకేజీ, పోస్టుల నియామకాల్లో అవకవతకలపై నిగ్గుతేల్చాలంటూ సోమవారం విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మంది రోడ్డు ఎక్కారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ సారథ్యంలో జరిగిన డీఎస్సీ రిక్రూట్‌మెంట్ మొత్తం అవకతవకల మయమని, మెరిట్‌ను.. రోస్టర్ పాయింట్లను పక్కనపెట్టి ఇష్టానుసారం పోస్టులు అమ్ముకొని ప్రతిభావంతులకు అన్యాయం చేశారని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరిట దగా చేసి, నిరుద్యోగ యువతను నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారుపై నిరసన తెలిపారు. అయితే, డీఎస్సీ అవినీతి ప్రజల్లోకి వెళ్లిందని, కచ్చితంగా దీనిపై భారీగా ప్రజా ఉద్యమం ఉంటుందన్న సమాచారం ముందే అందుకున్న ప్రభుత్వం పోలీసు వర్గాలను ఆదివారం రాత్రి నుంచే అప్రమత్తం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు యువత, ఉద్యమకారులపై లాఠీలు గురిపెట్టించింది. నాయకులను హౌస్ అరెస్టు చేయడమే కాకుండా.. నోటీసులు ఇస్తూ కేసులు పెడతామని బెదిరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లవద్ద, పార్టీ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఉద్యమాన్ని ముందుకు కదలనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించింది. అయితేనేం పోలీసులను దీటుగా ఎదుర్కొన్న యువత, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ నినదించారు.
● అడుగడుగునా ఆంక్షలు
విజయనగరం జిల్లా కేంద్రంలోని రామారాయుడు రోడ్డు (పీడబ్ల్యూ మార్కెట్) నుంచి ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీకి సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు నోటీసులు లేకుండానే భారీగా మోహరించి ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నగర పరిధిలోని పలు విభాగాలు, గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, యువత ఉదయం 11 గంటలకే పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ దమనకాండపై నిరసన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల ఆదేశాలను గౌరవిస్తూ ర్యాలీని విరమిస్తున్నట్లు కోలగట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలు, ప్రజా ఉద్యమాలను చూసి భయపడే పోలీసులతో అడ్డుకుందన్నారు.
ఊరూవాడా ఏకం కావడంతో సర్కారు బేజారు
శాంతియుత ర్యాలీలపై పోలీస్
ఆంక్షలు
నాయకుల హౌస్ అరెస్ట్..
అయినా వెనక్కి తగ్గని యువత
ఉద్యమాన్ని ముందుకు నడిపిన నాయకులు
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
రాజీనామాకు డిమాండ్


