ప్రారంభోత్సవం పేరిట ప్రజాధనం లూటీ! | - | Sakshi
Sakshi News home page

ప్రారంభోత్సవం పేరిట ప్రజాధనం లూటీ!

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం

జీవీఎంసీ, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, రాజాం, పార్వతీపురం పట్టణాల నుంచి దాదాపు 1,130 మంది కార్మికులను రప్పించి రాత్రింబవళ్లు పనిచేయించుకున్నారు. వీరికి భోజనాల ఏర్పాట్లు ప్రజారోగ్య విభాగం అధికారి పర్యవేక్షణలో జరిగింది. అయితే, భోజనం అత్యంత నాసిరకంగా తినడానికి వీలులేని విధంగా ఉందనే విమర్శలు కార్మికుల నుంచి వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందికి ‘తాత్కాలిక ఖర్చులు’ పేరుతో రూ.10 లక్షల రొక్కం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సోమ్ములు ఏ లెక్కన ఖర్చుచేశారో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తెలియాల్సి ఉంది.

విజయనగరం అర్బన్‌: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుక... కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్ల సిండికేట్‌కు ‘కమీషన్ల పండుగ’గా మారింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాల కల్పన పేరిట పిలిచిన టెండర్లలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో సేవలు అరకొరగా అందించడమే కాకుండా, నిబంధనలను తుంగలోతొక్కి ముందస్తు ప్రణాళికతో ప్రజాధనాన్ని లూటీచేసేలా స్కెచ్‌ వేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగితాలపై అంకెల గారడీ చూపి, రూ.కోట్లలో బిల్లులు మంజూరు చేసుకునేందుకు సర్వం సిద్ధంచేశారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

అంచనా పెంపు... టెండర్లలో గారడీ!

సాధారణంగా ప్రభుత్వ నిర్వహణ పనుల్లో పోటీతత్వం పెంచి, ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు బహిరంగ టెండర్లు నిర్వహిస్తుంటారు. కానీ, విమానాశ్రయం ప్రారంభోత్సవ వ్యవహారంలో విజయనగరం నగరపాలక సంస్థకు చెందిన ఒక కీలక అధికారి నేతృత్వంలో వింత ధోరణి నడిచిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇవే తరహా మొబైల్‌ టాయిలెట్లు, నీటి సరఫరా పనులకు కాంట్రాక్టర్లు 20 నుంచి 25 శాతం తక్కువ ధరకే పోటీపడి టెండర్లు దాఖలు చేసేవారు. అయితే, ఈ సారి ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కేవలం 2 శాతం తగ్గింపునకే టెండర్లను ఖరారు చేయడం వెనుక ఉన్న అంతరార్ధం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారికంగా టెండర్లు పిలిచినప్పటికీ, లోపాయికారీ ఒప్పందాలతో తమకు కావాల్సిన కాంట్రాక్టులకే పనులు దక్కేలా షార్ట్‌ టెండర్ల ప్రక్రియను వినియోగించుకున్నారని తెలుస్తోంది. జిల్లా అధికారుల పరిధి నుంచి దాదాపు రూ.కోటి నిధులను ముందస్తుగా తెప్పించి కాంట్రాక్టర్లకు అందించడం వెనుక ఉన్న వేగం క్షేత్రస్థాయి పనుల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

దర్యాప్తునకు పెరుగుతున్న డిమాండ్‌

ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతున్నా, క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో దారుణంగా విఫలమయ్యారనడానికి ఇక్కడి పరిస్థితులే నిదర్శనం. పనులు సరిగ్గా జరగకపోయినా, అధికార బలాన్ని ఉపయోగించి 100 శాతం బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరు చెప్పి నిర్వహించిన వేడుకల్లో, సేవలు అందించకుండా బిల్లు బొక్కేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారుల, కాంట్రాక్టర్ల సిండికేట్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని స్థానిక ప్రజలు, సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

నిధుల కేటాయింపు ఇలా..

పారిశుద్ధ్య విభాగం లెక్కల ప్రకారం ఏకంగా రూ.3 కోట్లు నిధులు వ్యయమైనట్లు చూపుతున్నారు. అందులో రూ.1.74 కోట్లు కేవలం మరుగుదొడ్లు, నీటి డ్రమ్ములు, ట్యాంకర్ల సరఫరాకే కేటాయించారు.

విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరిట నిధుల దుర్వినియోగం

పారిశుద్ధ్య విభాగానికి కేటాయించిన

రూ.3 కోట్లలో మరుగుదొడ్లు, నీటి సరఫరాకే రూ.1.74 కోట్లు

అంచనా పెంపు... టెండర్లలో గారడీ!

దర్యాప్తు చేయాలని జనం డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement