ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

విజయనగరం: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య అవార్డు–2026ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, డైట్‌లలో పదేళ్ల వృత్తి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 17 నుంచి 22వ తేదీలోగా ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందజేయాలని కోరారు.

ఖరీఫ్‌ రుణ లక్ష్యం రూ.2,400 కోట్లు

● డీసీసీబీ జీఎం కేవీవీఆర్‌ఎన్‌ సత్యనారాయణ

రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2,400 కోట్లు రుణాలు మంజూరు చేయాలన్నది లక్ష్యమని డీసీసీబీ జీఎం కేవీవీఆర్‌ఎన్‌ సత్యనారాయణ తెలిపారు. మండలకేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.1980 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రూ.380 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డీసీసీబీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీలో 0.5 శాతం వరకు అధిక వడ్డీ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభా వంతో వర్షపాతం తక్కువగా నమోదు కానుందని వాతావరణ శాఖాధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఖాతాదారులంతా ఈ నెల 15వ తేదీలోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. ఐబీబీఎస్‌ ద్వారా కొత్తగా 25 మంది సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్‌ మేనేజర్‌ కర్రి జానకి, సూపర్‌వైజర్‌ తెంటు రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

పొటాష్‌ ఎరువు ధరలు తగ్గించాలి

రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌కు విన్నవించిన రైతులు

డెంకాడ: పొటాష్‌ ఎరువు ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ మనాజీర్‌ జిలానీసమూన్‌కు విన్నవించారు. డెంకాడ మండలం సింగవరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. వరి ఉభాలు చేస్తున్న పొలాలను పరిశీలించారు. పంటకు మేలు చేసే అజోస్పిరిల్లమ్‌ అనే జీవరసాయనిక ఎరువును చల్లించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ఎరువుల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ తదితర వాటిపై రైతులతో ముచ్చటించారు. ఆయిల్‌ ఇంజిన్లు, నీటిని తరలించే పైపులు రైతులకు అందించాలని రైతులు కోరారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే అపరాలు, కొర్రలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని రైతులు ఈ నెల 15వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వీటీ రామారావు, డీడీఏ ఎం.రామారావు, డీపీఎం విజయ్‌కుమార్‌, శాస్త్రవేత్త తేజేశ్వరరావు, ఇన్‌చార్జి ఏడీఏ సంగీత, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

11న సీతంపేట ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవం

సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో అమరావతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నందున అక్కడికి మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో 9వ తేదీకి బదులు 11న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement