రాజాం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను ఎంఈఓ యాగాటి దుర్గారావు శుక్రవారం పరిశీలించారు. పెనుబాక, కంచరాం, బొద్దాం తదితర పాఠశాలల్లో గుడ్ల పరిమాణంపై ఆరాతీశారు. వంట ఏజెన్సీతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న గుడ్ల పరిమాణం చిన్నదిగా ఉండడంపై ఈనెల 7న సాక్షిలో ‘గుడ్డు చిన్నబోయింది’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈఓ పలు పాఠశాలలో వాటిపై ఆరాతీయడంతో పాటు ఏజెన్సీతో మాట్లాడారు. గుడ్డు పరిమాణం తగ్గితే బిల్లులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అమరావతి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం జరిగాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జీ స్టేడియంలో బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అండర్–17, 23 వయస్సుల విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపిక పోటీలను పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, శాప్‌కోచ్‌లు పర్యవేక్షించారు.
సెంచూరియన్‌లో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్‌క్లేవ్’
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్‌క్లేవ్–2026’ శుక్రవారం నిర్వహించారు. భవిష్యత్ నైపుణ్యాలు, కత్రిమ మేధస్సు, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమ–విద్యా భాగస్వామ్యంపై నిపుణులు చర్చించారు. ఏఐతో సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అపిటోరియా ఫార్మా ప్లాంట్ హెడ్ డాక్టర్ కె. సాంబిరెడ్డి సూచించారు. పరిశోధనలు, స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం అవసరమని సీఐఐ చైర్మన్ జి.కృష్ణమోహన్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతను వీసీ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకట రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
బొబ్బిలి: పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం జంక్షన్‌లో శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని కృష్ణాపురానికి చెందిన చొక్కాపు ఈశ్వర రావు ఆలయం రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి బైక్‌పై వెళ్తున్నాడు.అదే సమయంలో మెయిన్‌రోడ్డులో బైక్‌పై వస్తున్న పట్టణానికి చెందిన బి. వెంకట్రావు, డి.అప్పలనాయుడులను ఈశ్వర రావు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. వారిని స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. తీవ్ర గాయాల పాలైన ఈశ్వర రావును విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కె. నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


