ఆండ్ర జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

ఆండ్ర జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

ఆండ్ర జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

మెంటాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను ఆంధ్రప్రదేశ్‌ మీదుగా గోదావరికి అనుసంధానించే ప్రతిపాదిత మార్గంలో ఉన్న ఆండ్ర జలాశయాన్ని జాతీయ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఇంజినీరు దేవానందరావు, అంతరరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీరు టి.గోవిందరావు నేతృత్వంలోని ఈ బృందం జలాశయం ప్రస్తుత స్థితిగతులను, ఇక్కడ చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

రూ. 54,019 కోట్ల మెగా ప్రాజెక్టు

సుమారు రూ. 54,019 కోట్ల అంచనా వ్యయంతో నదుల అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు బృంద అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని జంఝావతి జలాశయానికి, విజయనగరం జిల్లాలో ఉన్న ఆండ్ర, తాడిపూడి జలాశయాలకు అనుసంధానిస్తారు. ఆపై అనకాపల్లి జిల్లాలోని రైవాడ రిజర్వాయర్‌కు గోదావరి నది జలాలను మళ్లిస్తామని వివరించారు.

తొలివిడత క్షేత్రస్థాయి పరిశీలన

నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రధాన కాలువ ఆండ్ర జలాశయం మీదుగా వెళ్లనుందని, ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి తొలి పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీసి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్శనలో నార్త్‌ కోస్ట్‌ చీఫ్‌ ఇంజినీరు వేణుగోపాల్‌, ఎస్‌ఈ అప్పలనాయుడు, ఈఈ గోవిందరావు, ఆండ్ర రిజర్వాయర్‌ డీఈ రామునాయుడు, ఏఈ కృపాంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement