● ఓపీ రోగులకు స్కాన్ లేదంట!
● సర్వజన ఆస్పత్రి వైద్యాధికారుల
వింత తీరు
● అవస్థలు పడుతున్న రోగులు
అవును నిజమే...
ఎంఆర్‌ఐ స్కాన్ దుర్వినియోగం అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందువల్లే ఇన్‌పేషెంట్లకు తీయాలని నిబంధన పెట్టాం.
– డాక్టర్ అల్లు పద్మజ,
సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
విజయనగరం ఫోర్ట్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోగులకు కష్టాలు ఎక్కువయ్యాయి. థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధుల నిర్ధారణకు చేసే హెచ్‌బీఏ1సీ పరీక్షలు సర్వజన ఆస్పత్రిలో అందుబాటులో లేవు. వీటికి తోడు ఎంఆర్‌ఐ స్కాన్‌కు కూడా కొత్త నిబంధనలు పెట్టడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇదేం చోద్యం అంటూ రోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందుతాయని వస్తే వైద్యాధికారుల పెట్టిన నిబంధనలు వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుల తరబడి...
ఏదైనా వ్యాధి నిర్ధారణ ఎంఆర్‌ఐ స్కాన్‌లో కచ్చితంగా వస్తుంది. దీంతో వైద్యులు ఎంఆర్‌ఐ స్కాన్ అవసరమైన వారికి ఆస్పత్రిలో ఉన్న గదికి వెళ్లి చేయించుకోవాలని చీటి రాసి ఇస్తారు. కొద్ది రోజుల క్రితం వరకు ఓపీ(ఔట్ పేషెంట్) రోగులకు కూడా ఎంఆర్‌ఐ స్కాన్ తీసేవారు. స్కాన్‌లో ఏదైనా సమస్య ఉన్నట్టయితే దానికి సంబంధించిన చికిత్స రోగులకు అందించేవారు. కానీ ఇటీవల ఆస్పత్రి అధికారులు ఔట్ పేషెంట్లకు ఎంఆర్‌ఐ స్కాన్ రాయొద్దని వైద్యులకు సూచించారు. ఇన్‌పేషెంట్లుగా ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఎంఆర్‌ఐ స్కాన్ రాయాలని సూచించడంతో వైద్యులు కూడా ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఎంఆర్‌ఐ స్కాన్ తీస్తున్నారు.
భారం తగ్గించుకునేందుకే..
ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ నిర్వహణను ఎన్‌ఆర్‌ఐ సంస్థ నిర్వహిస్తుంది. రోగులకు తీసే ఎంఆర్‌ఐ స్కాన్‌కు రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఎక్కువ స్కాన్‌లు తీస్తే ఎక్కువ మొత్తం ఎన్‌ఆర్‌ఐ సంస్థకు చెల్లించాల్సి వస్తుందని భారం తగ్గించుకోవడం కోసం చంద్రబాబు ప్రభు త్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇన్‌పేషెంట్లు అయితే తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఓపీ అయితే ఎక్కువ మంది ఉంటారు. వీరికి స్కాన్ తీస్తే ఎక్కువ స్కాన్‌లు తీయాల్సి వస్తుంది. అందువల్లే ఇన్‌పేషెంట్లకు మాత్రమే స్కాన్ తీస్తామని నిబంధన తీసుకొ చ్చారని రోగులు గుసగుసలాడుకుంటున్నారు.
గంట్యాడ మండలానికి చెందిన సూర్యనారాయణ హైబీపీతో పాటు, తల తిరుగుతూ కింద పడిపోతుండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ (ఇన్‌పేషేంట్) అయితేగాని ఎంఆర్‌ఐ స్కాన్ రాయనని చెప్పడంతో చేసేది లేక అడ్మిట్ అయ్యాడు.
విజయనగరం పట్టణానికి చెందిన చైతన్య తీవ్రమైన నడుం నొప్పి రావడంతో సర్వజన ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు అతన్ని అడ్మిట్ చేసి ఎంఆర్‌ఐ స్కాన్ తీశారు.


