● సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● విద్యుత్ శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు
విజయనగరం: వర్షాకాలం కారణంగా ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోలార్ విద్యుత్ కోసం సబ్సిడీ ద్వారా అమలవుతున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రెండున్నరేళ్లలో రూ.539 కోట్లతో జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పనులు చేయించామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సేవలు జాప్యం అవుతున్నట్లు పత్రికలు ద్వారా వస్తున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 2 తేదీన విద్యుత్ సేఫ్టీ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు అక్కడక్కడ జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు పోలీసుల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ పి.హరి, గోపాలరావు నాయుడు, ఈఈ టెక్నికల్ జి.శంకరరావు, సీనియర్ అకౌంటెంట్ ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు.


