మెంటాడ: జయతి గ్రామంలోని పురాతన శివాలయాన్ని జిల్లా జడ్జి ఎం.శ్రీధర్ శనివారం సందర్శించారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంభ సహిత మల్లికార్జున స్వామి వారికి జడ్జి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని 11వ శతాబ్దానికి చెందిన విజ్ఞేశ్వర ఆలయం, పార్వతి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సత్యంనాయుడు జడ్జి శ్రీధర్‌ను రుద్రాక్షమాల, శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో గజపతినగరం సివిల్ కోర్టు జడ్జి ఎ.విజయకుమార్, న్యాయవాదులు రమేష్ రాజు, విద్యాసాగర్ నాయుడు, లెంక రాంబాబు పాల్గొన్నారు.
కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యూవల్ ప్రక్రియ రేపు
చీపురుపల్లి: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్ ప్రక్రియను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20న నిర్వహించనున్నట్టు చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లలిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులందరూ ఈ నెల 20న చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
బంధిత కార్మిక వ్యవస్థ చట్టవిరుద్ధం
విజయనగరం లీగల్: బంధిత కార్మిక వ్యవస్థ చట్టవిరుద్ధమని, ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవనం, స్వేచ్ఛగా ఉపాధి పొందే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌పర్సన్ బబిత అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ, నేచర్ ఎన్‌జీఓ సంయుక్తంగా శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బంధిత కార్మికులను గుర్తించడం, రక్షించడం, పునరావాసం కల్పించడం, సంబంధిత అధికారులకు సమాచారం అందించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కృష్ణప్రసాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయంను వివరించారు. కార్యక్రమంలో నేచర్ ఎన్‌జీఓ ప్రతినిధి రవితేజ పాల్గొన్నారు.
స్పందించిన కలెక్టర్..
చేతికందిన ధ్రువపత్రం
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ పోర్టికోలో ఆందోళనగా నిల్చున్న పాలూరి పద్మ అనే మహిళను శనివారం కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి చూశారు. ఆమెను దగ్గరకు పిలిచి ప్రశ్నించారు. మానసిక దివ్యాంగురాలైన తన కుమార్తె కులధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ తప్పుగా పడిందని, సరిచేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని ఆమె తెలియజేసింది. అంతే... వెంటనే నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్‌ను లైన్‌లోకి తీసుకున్నారు. ‘సార్, పాతది రద్దు చేయాలి, కొత్త ప్రపోజల్స్ పంపాలి’ అంటూ తహసీల్దార్ అటునుంచి టెక్నికల్ డైలాగులు పండించారు. ఆపై జాయింట్ కలెక్టర్ ఆఫీసుకు రావాడం, ఫైల్‌పై సంతకం పెట్టడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఉద యం తప్పుతో వచ్చిన అప్లికేషన్... సాయంత్రానికి సర్టిఫికెట్‌గా మారి బాధిత మహిళ చేతిలోకి వచ్చేసింది. ‘గంటల వ్యవధి’లో జరిగిన పనిని చూసి హర్షించాలో.. లేదంటే మన వ్యవస్థల తీరును చూసి నవ్వుకోవాలో ప్రజలకు అర్ధం కాలేదు. ఒకే ఒక అర్జీపై కలెక్టర్, జేసీ, తహసీల్దార్... ఇలా ముగ్గురు పెద్ద అధికారులు ఒకే రోజు యుద్ధప్రాతిపదికన దృష్టి పెడితే కానీ ఒక తప్పు సవరణ కాలేదంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


