స్థానికతకు పాతర..! | - | Sakshi
Sakshi News home page

స్థానికతకు పాతర..!

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

● ఉద్యోగల గొంతు నొక్కుతున్న ‘జీఓ 129’

● కొత్త క్యాడర్ల కేటాయింపు పేరుతో భారీ కుట్ర...

● భగ్గుమన్న ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం

విజయనగరం అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను కొత్త లోకల్‌ క్యాడర్లకు (జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌) కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 129 ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పైకి అంతా సజావుగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. మార్గదర్శకాల వెనుక ఉద్యోగులను సొంత జిల్లాల నుంచి శాశ్వతంగా తరమేసే కుట్ర దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2025 ప్రెసిడెన్షియల్‌ ఆర్డన్‌ పేరుతో తెచ్చిన ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో సర్వీసులో ఉన్న వివిధ శాఖలకు చెందిన 30 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

జూనియర్లకు మొండిచేయేనా..?

ప్రభుత్వం ప్రకటించిన కేటాయింపు విధానంలో ‘సీనియారిటీ + ఆప్షన్‌’ ప్రాతిపదికన సీనియర్లకు వారు కోరుకున్న జిల్లా దక్కే అవకాశం ఉంది. సర్వీసు తక్కువగా ఉన్న జూనియర్‌ ఉద్యోగులు, ఇటీవల రిక్రూట్‌ అయిన ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోనున్నారు. సీనియర్లు ఆప్షన్లు పెట్టేసుకున్నాక మిగిలిపోయిన జిల్లాలకు జూనియర్లను బలవంతంగా పంపించే ప్రమాదం ఉంది. జీవితకాలం మొత్తం సొంత జిల్లాకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

ఇది బాధ్యతారాహిత్యం

డ్రాఫ్ట్‌ సీనియారిటీ లిస్ట్‌ (డీఎస్‌ఎల్‌) విడుదల చేసిన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు ఐదు రోజుల గడువు సరిపోదని ఉద్యోగులు చెబుతున్నారు.

– జీఓ–129లో ఉద్యోగులైన భార్యాభర్తలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటాయింపు ప్రక్రియ ముగిసి, వేర్వేరు కేడర్లకు వెళ్లిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధన సరికాదని, భార్యాభర్తలను మానసిక క్షోభకు గురిచేసేందుకే నిబంధన తెచ్చారన్న వాదన వినిపిస్తోంది.

ఇదెక్కడి తొందరపాటు

తుదిజాబితా వచ్చిన 7 రోజుల్లోనే కొత్త లోకల్‌ క్యాడర్‌లో చేరాలని గడువు విధించారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా వేరే జోన్‌కు మారేటప్పుడు కుటుంబాలను మార్చడం, పిల్లల చదువులు, ఇళ్ల సర్దుబాటు వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. కనీసం ప్రయాణానికి, సర్దుబాటుకు తగిన సమయం ఇవ్వకుండా వారం రోజుల్లోనే చేరిపోవాలని హుకుం జారీ చేయడం ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తోంది.

కంటితుడుపు ‘అప్పీల్‌’ అవకాశం!

కేటాయింపులపై అసంతృప్తి ఉంటే 7 రోజుల్లో అప్పీల్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే కమిటీలు (డీఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ, ఎస్‌ఎల్‌సీ) ఒక నిర్ణయానికి వచ్చి జాబితాలు విడుదల చేసిన తర్వాత, మళ్లీ ఆ కమిటీలకే అప్పీల్‌ చేసుకుంటే న్యాయం జరుగుతుందా? అన్నది ఉద్యోగుల ప్రశ్న. ఇదంతా కేవలం కంటితుడుపు చర్చేనని, కోర్డులకెళ్లకుండా ఉద్యోగుల నోళ్లు నొక్కేందుకే ఈ నామ మాత్రపు అప్పీల్‌ నిబంధన పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.

విభజన జీఓతో ప్రాంతీయ అసమానతలు తప్పవు

తాజా జీఓ–129తో ఉద్యోగులను కొత్త జిల్లాలకు శాశ్వతంగా కేటాయించడం వల్ల ఇబ్బందులు తప్పవు. ‘రివర్స్‌ సీనియారిటీ’ విధానం వల్ల గ్రామీణ ప్రాంత జిల్లాలకు యువ ఉద్యోగులు బదిలీ అవుతారు. ఆయా జిల్లాల్లో రాబోయే ఇరవై ఏళ్లపాటు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇది జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. స్థానికత ఆధారంగా సమాన అవకాశాలు కల్పించాలనే రాజ్యాంగ ప్రాథమిక సూత్రానికి విఘాతం కలిగిస్తుంది. ప్రభుత్వం దీనిపై వెంటనే పునఃసమీక్షించాలి.

– ఎల్‌.వి.యుగంధర్‌, రాష్ట్ర కార్యదర్శి, ఏపీజీఈఏ

సమస్యలు పరిష్కరించాకే విభజన చేపట్టాలి

ప్రభుత్వం జీఓ 129 ద్వారా చేపడుతున్న కొత్త స్థానిక క్యాడర్ల కేటాయింపు ప్రక్రియ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలలో అభ్యంతరాలన్నింటినీ పూర్తిగా పరిశీలించి, క్లియర్‌ చేసిన తర్వాతే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి.

– డి.శ్యామ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement