సాక్షిప్రతినిధి, విజయనగరం:
ఇన్నాళ్లూ ఒక లెక్క.. మా చిన్నాయన గెలిస్తే ఇంకోలెక్క.. బొబ్బిలి కాస్తా విశాఖపట్నం అయిపోద్ది.. గ్రోత్ సెంటర్ నిండిపోద్ది.. ఊళ్లన్నీ ఉద్యోగాలతో కిటకిటలాడిపోతాయి.. జీతాలు లెక్కెట్టుకోవడమే ఇక.. పాలుపోసి పాలు ఎత్తేలా రోడ్లు రెడీ.. చెరువులు వాగులు వంకలు అన్నీ శుభ్రం.. సేద్యం ఇక భద్రం.. ఇవన్నీ కావాలంటే బేబీ నాయనను గెలిపించండి... బొబ్బిలి చుట్టుపక్కల ఎక్కడ రోడ్డు చెడిపోయినా చేతిడబ్బులతో బాగు చేయించేమనిషి.. ఇక ఆయనే నేరుగా ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో చూడండి అని ఊదరగొట్టిన టీడీపీ కార్యకర్తలు.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు.. అనుకున్నట్టే బేబీ గెలిచారు.. ఆ హైప్.. ఆ క్రేజ్ అంతా రెండేళ్లలో తుస్‌మంది. ఆశలన్నీ మెల్లగా కరిగిపోయాయి. ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పని కనిపించడంలేదు. ప్రచారానికి ప్రగతి ఆనడంలేదు.
● ఫొటోలు తప్ప నిధులేవీ ?
నియోజకవర్గంలోని పలు అంశాలమీద బేబీ తరచూ మంత్రులు.. అధికారులను కలిసి వినతిపత్రాలు ఇవ్వడం.. అవి సోషల్ మీడియాలో కనిపించడం మినహా వాటికి ఎక్కడా నిధులు వచ్చాయనేది కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులకొరతతో అల్లాడుతుండడంతో ఇలాంటి వినతిపత్రాలను మంత్రులు చూసి జస్ట్ పక్కన పెట్టడం మినహా ఇంకేం కానరావడం లేదు. ఎంత మంది మంత్రులు... ఆఖరుకు లోకేశ్.. చంద్రబాబును సైతం కలుస్తున్నా ఫొటోలు తప్ప నిధులు వచ్చినట్లయితే ఎక్కడా లేదంటూ నియోజకవర్గ వాసులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.. ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏం లేకపోయిందని క్యాడర్ సైతం లోలోన గొణుగుతున్నారు.
బాబూ.. నాయినగారిని కలవాలి.. అబ్బే ఆయన లేరమ్మా.. బిజీగా ఉన్నారు.. ఇయ్యాల దొరకడం కష్టమే.. ఆరేడు పెళ్లిళ్లున్నాయి.. వాటికి వెళ్లిరావాలి..
రేపు ఎల్లుండి వచ్చేదా.. వద్దొద్దు.. ఆదివారం మొత్తం సమర్తి ఫంక్షన్లకు వెళ్తారు..
పోనీ బుధవారం.. ఆ రోజు రెండు పాన్ షాపులు.. రెండు టీకొట్ల ఓపెనింగ్ పనులున్నాయి.. తరువాత బెజవాడ వెళ్లాలి.. ఇంకోరోజు చెబుతాలే.. వద్దువు గాని..
అయితే వచ్చేవారం వచ్చేదా... వద్దురా బాబు శ్రావణం వచ్చేద్ది... ఇక మళ్లా పెళ్లిళ్లు.. ఫంక్షన్లు.. అయితే మరి నాయిన గారు ఎప్పుడు కలుస్తారు.. ? ఎప్పుడంటే ఏమి చెప్పాలి... మూఢం రోజుల్లో రా.. కోటలోనే ఉంటారు... నాయిన గారిని కలిపించెత్తాను.. అలాగే, అయితే వెళ్లిపోతాను..
పెళ్లిళ్లు, ఇతర కార్యాలతోనే ఎమ్మెల్యే డైరీ ఫుల్ .. అభివృద్ధి నిల్
మంత్రులకు వినతిపత్రాలు.. వాళ్లతో ఫొటోలు తప్ప ఇంకేం లేదు
ఒక్క ప్రాజెక్టుకూ కదలిక లేదు...
అభివృద్ధి గట్రా లేనట్టే..
గెలిచిన హైప్ రెండేళ్లలోనే తుస్..
అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏడాదికాలం ఉండగానే తనను గెలిపిస్తే బొబ్బిలి నియోజకవర్గంలోని రోడ్లను మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చి పాదయాత్ర చేశారు. ఆయన గెలిచారు కానీ ఆ రోడ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. రాళ్లుతో దర్శనమిస్తున్నాయి.
నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.. ఆ హామీ కూడా అలాగే ఉండిపోయింది.
బాడంగి మండలం గొల్లాది వద్ద వేగవతి నదిపై వంతెన నిర్మిస్తానని, గెలవగానే పనులు ప్రారంభించి అక్కడే ఓ రోజు రాత్రి నిద్ర పోతానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కోటలో నిద్రపోతుండగా బ్రిడ్జి మాత్రం ప్రతిపాదనల్లో నిద్దరోతోంది.
బొబ్బిలి గురుకుల పాఠశాలను దత్తత తీసుకుంటానన్నారు.. అనుకున్నంత సులువుగా పనులు కావుగా.. అందుకే అది కూడా హామీగానే మిగిలిపోయింది.
రామభద్రపురం మండలంలోని ఏడొంపుల గెడ్డపై వంతెన నిర్మాణం కూడా అంతే. వంతెన ఏదీ అంటే ఉండవయ్యా ఏడొంపులు తీర్చడం అంత సులువేటి? అనే సమాధానం వస్తోంది.
చుట్టుపక్కల 16 మండలాలకు అన్ని రంగాలకు కేంద్రమైన బొబ్బిలిలో నేటికీ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ లేదు.. విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలే దిక్కయ్యాయి.
గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు వస్తాయి.. స్థానికులకు ఉద్యోగాలు అన్నారు.. అదేం లేకుండానే కాలం కరిగిపోతోంది.. కుర్రాళ్ల కలలు కూడా కల్లలవుతున్నాయి. వలసలు నివారిస్తాననీ చెప్పారు. కానీ అది చెప్పినంత సులువు కాదని ఆయనతోబాటు జనాలకు అర్థం అవుతోంది.
మరోపక్క గ్రోత్ సెంటర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నైపుణ్య, నైపుణ్యం లేని కార్మికులే నేటికీ పని చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఎండమావిగానే మారాయి.
పేదలకు భూములు పంచేస్తామని చెప్పారు... ఇప్పడు గిరిజన భూముల మీదే కన్నేసి లాక్కోవడంతో ఆ వర్గమంతా గుర్రుమంటోంది.
ఇసుక వ్యాపారం, పదవులు లాక్కోవడం, ఎదురు ప్రశ్నించేవారిని కోటకు పిలిచి కోటరీతో బెదిరించడమే కనిపిస్తోంది తప్ప.. నియోజకవర్గ ప్రజలకు, పేదల సంక్షేమానికి, పల్లెలు, పట్టణ అభివృద్ధికి చేసింది శూన్యమని, ఓటేసి తప్పుచేశామంటూ బొబ్బిలి వాసులు ఇప్పుడు లోలోన మదనపడుతున్నారట.


