బలిజిపేట: ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రమించిన, కొనుగోలు చేసిన మా భూములు మాకు కాకుండా చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో బలిజిపేట మండలంలోని గలావల్లి గ్రామ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రామంలో 1350సర్వే నంబర్లకు సంబంధించిన 500మంది రైతులకు చెందిన 600ఎకరాలకు పైగా భూమి జీరో అకౌంట్, 2 వేల అకౌంట్, రాముడు, సీత అకౌంట్లలో ఉన్నాయని వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకుంటేనే వాటిని సరిచేయగలవని లేకపోతే మీ ఖాతాలోకి రావని రెవెన్యూ అధికారులు ఇప్పుడు చెప్పడం ఏమిటని, ఇదో వింతనాటకంగా ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎప్పుడు మ్యుటేషన్‌కు పెట్టినా మీ నంబర్లు ఆయా ఖాతాల్లో ఉన్నాయి అని చెప్పేవారే కాని దానిని ఏ విధంగా సరిచేయాలనేది ఇంతవరకు రెవెన్యూ శాఖకు చెందిన ఎవరూ చెప్పలేదని వాపోతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా రీ–సర్వే
2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గలావల్లిలో రీ–సర్వే పక్కాగా జరిగిందని దాని ప్రకారం మా పాస్‌పుస్తకాలు మాకు ఇచ్చిఉంటే మాకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉండేదికాదని రైతులు వాపోతున్నారు. అప్పట్లో ఫీల్డ్ వెరిఫికేషన్‌లో భూమిని సాగుచేస్తున్న రైతుతో పత్రాలను చూపించిన తరువాత ఆభూమికి అన్ని వైపులా ఎవరు ఉన్నారో వారినుంచి వాస్తవాన్ని తెలుసుకుని పక్కాగా రీసర్వే చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిందని దానిని నిలుపుదల చేశారు. ప్రభుత్వం మారి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత గలావల్లిలో రెండోసారి రీ–సర్వే నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు. భూములు సాగు చేసుకుంటున్న రైతుల భూములకు వన్–బీలు రాకపోగా మీ భూములు జీరో అకౌంట్లో, 2వేల ఖాతాలో, రాముడు, సీత ఖాతాల్లో ఉన్నాయని ఇప్పుడు రెవెన్యూ అదికారులు చెప్పడంతో ఇదేమి విడ్డూరమంటూ లబోదిబోమంటున్నారు. పాత పాస్‌బుక్, గ్రామ పురోణీలు, క్రయ, విక్రయ డాక్యుమెంట్లు, వారసత్వ ఆధారాలు ఉండి మా భూములకు వన్–బీలు రాకపోవడం దారుణంగా ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఆన్‌లైన్ ఎప్పుడు జరిగింది–ఖాతాలంటే ఏమిటి:
2011లో వెబ్‌ల్యాండ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతవరకు చేతిరాతద్వారా ఉండే పాస్‌పుస్తకాల స్థానే డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో పాస్ పుస్తకాల్లో ఉండే భూమి వివరాలు వెబ్‌ల్యాండ్ చేసి డిజిటలైజేషన్ చేశారు. ఇక ఆసమయంలో రైతులు వారివారి భూములకు సంబంధించిన ఆధారాలు సక్రమంగా చూపించిన వారికి వెబ్‌ల్యాండ్‌లో పక్కాగా ఆన్‌లైన్ జరిగింది. ఆసమయంలో ఆధారాలు చూపలేని రైతుల భూములకు గ్రామాన్ని బట్టి ఒక అంకెను పెట్టి నామకరణం చేసి దానిలో వారివారి భూములను చేర్చారు. అందులో భాగంగా గలావల్లి భూములు 2వేల ఖాతాకు చేరాయి. ఇక రాముడు, సీత ఖాతా అంటే గ్రామంలో ఎవరి పేరునా ఆభూములను పెట్టలేక ఏదో ఒక నామకరణం చేయాలి కనుక రాముడు, సీత ఖాతాలని పెట్టి దానిలో కొంతభాగం చేరింది. ఈ ప్రకారం ఖాతాలు ఏర్పాటు జరిగాయి.
గలావిల్లి రైతుల్లో గందరగోళం
వేరువేరుగా సర్వే నంబర్లు
రీ–సర్వే చేసిన తరువాత రెవెన్యూశాఖ వారు ఇచ్చే సర్వే నంబర్ల జాబితాకు రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్లలో సర్వే నంబర్లు వేరువేరుగా కనిపిస్తున్నాయని ఇదో గందరగోళంగా ఉందని రైతులు చెబుతున్నారు.


