అల్లిపురం: మెగా డీఎస్సీ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడం, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్‌లను ఖండిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిందన్నారు. నిరుద్యోగుల సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాజా నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కర్ణం కృష్ణ, రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్, గాజువాక నాయకులు గిల్బర్ట్, నార్త్ నియోజకవర్గం సెక్రటరీ వి.చెన్నారావు, పైడితల్లి నాయుడు, సింహాద్రి, అనిల్‌కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నేతల ఆగ్రహం


