అఖిలపక్ష కార్మిక సంఘాలు జైల్ భరో
డాబాగార్డెన్స్: క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాలు సోమవారం నిర్వహించిన జైల్ భరో నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ‘వేతనాలైనా పెంచండి.. జైల్లోనైనా పెట్టండి’ అంటూ కార్మికులు చేసిన నినాదాలతో జగదాంబ జంక్షన్ మార్మోగింది. సీఐటీయూ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా కలెక్టరేట్ వైపు బయలుదేరగా పోలీసులు వారిని నిలువరించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా, వారిని పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్, ఫోర్త్‌టౌన్ స్టేషన్లకు తరలించారు.
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎం.జగ్గునాయుడు, మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, జీఎస్‌జే అచ్యుతరావు, కనకారావు, లక్ష్మీ, కె.హేమలత, బి.జగన్, ఎం.సుబ్బారావు, వెంకట్రావు, ఆర్.లక్ష్మణమూర్తి, యు.రాజు, బంగారునాయుడు, మేరీ, మంగశ్రీ, ఝాన్సీ, పద్మ, రమణ, ఏఐటీయూసీ నాయకులు ఎం.మన్మథరావు, పడాల రమణ, ఐఎన్‌టీయూసీ నాయకుడు ఈశ్వరరావు, సీఎఫ్‌టీయూఐ నాయకుడు నరేష్ పాల్గొన్నారు.


