చర్చలు విఫలం కావడంతో
నిరవధిక ఆందోళన
నేటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో
ఓపీల బహిష్కరణ
ఆస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకున్న పేద రోగులకు ‘సమ్మె’ కష్టాలు మొదలయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెబాట పట్టారు. సోమవారం అమరావతి వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్యా డైరెక్టర్(డీఎంఈ), ఇతర అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో కేజీహెచ్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది.
ఓపీలు బంద్.. స్తంభించనున్న సేవలు
సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు, పరీక్షలు చేయడంలో పీజీ డాక్టర్లు, హౌస్‌సర్జన్లదే కీలక పాత్ర. వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వేలాది మంది పేద రోగులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడనున్నారు.
హామీలు నెరవేర్చేవరకు తగ్గేదే లేదు
ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్ధీకరించాలని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ డిమాండ్ చేశారు. డీఎంఈతో చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీజేయూడీఏ నేతలు హెచ్చరించారు.


