ప్రమోషన్లు, పోస్టింగుల్లో తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్లు, పోస్టింగుల్లో తీవ్ర అన్యాయం

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

● పూర్వ వాల్తేర్‌ ఉద్యోగుల ఆందోళన ● జాయింట్‌ జేపీవో విడుదల చేయాలని డిమాండ్‌

తాటిచెట్లపాలెం: వాల్తేర్‌ డివిజన్‌ విభజన అనంతరం రాయగడ డివిజన్‌లో కొనసాగుతున్న పూర్వ వాల్తేర్‌ ఉద్యోగులకు ప్రమోషన్లు, పోస్టింగుల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దొండపర్తిలోని డీఆర్‌ఎం కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా పనిచేసిన తమకు విశాఖపట్నం డివిజన్‌లో పోస్టింగులు కల్పించకుండా, తమకంటే జూనియర్లకు ఇక్కడే ప్రమోషన్లు, పోస్టింగులు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్తేర్‌ డివిజన్‌ విభజన సమయంలో ట్రయాంగులర్‌ పాలసీ ప్రకారం రాయగడ డివిజన్‌లో పోస్టింగులు కేటాయించారని తెలిపారు. జూన్‌ 1, 2026 నుంచి విశాఖపట్నం, రాయగడ డివిజన్లు వేర్వేరుగా ఏర్పడిన నేపథ్యంలో డీపీఆర్‌ నిబంధనల ప్రకారం తమ సీనియారిటీ, లీన్‌, ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని విశాఖపట్నం డివిజన్‌లో పోస్టింగులు కల్పించాలని కోరారు. డీపీఆర్‌ పేరా 9.3 ప్రకారం సీనియర్లకు పోస్టింగులు ఇచ్చిన తర్వాతే కొత్త సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం–రాయగడ జాయింట్‌ జేపీవోను తక్షణమే విడుదల చేయాలని, జేపీవో ప్రక్రియ పూర్తయ్యే వరకు విశాఖపట్నం డివిజన్‌లో కొత్త పోస్టింగులను నిలిపివేయాలని కోరారు. జూన్‌ 1 తర్వాత విశాఖపట్నం డివిజన్‌లో ఇచ్చిన పోస్టింగులను పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీనియర్‌ డీపీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిరిపురంలోని దక్షిణ కోస్తా రైల్వే జీఎం కార్యాలయానికి వెళ్లి పీసీపీఓను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. అక్కడ కూడా సానుకూల స్పందన లభించలేదని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆందోళనలో రాయగడ డివిజన్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement