● జంతుప్రదర్శన శాలలో సందడి చేస్తున్న నాలుగు గజరాజులు
● రోజూ ఒక్కో ఏనుగుకు 265 కిలోల ఆహారం
● ఏటా రూ.4.30 లక్షల ఖర్చు ● సంరక్షణకు ముందుకొస్తున్న దాతలు
● నేడు ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం
మగ ఏనుగు కృష్ణ
రోజుకి 265 కిలోల ‘ఆహార’ విందు!
జూలో ఒక్కో ఏనుగుకు రోజుకి సుమారు 265 కిలోల వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తారు. అలాగే రోజుకు కనీసం 150 లీటర్ల నీరు తాగుతాయి.
ఒక్కో ఏనుగు రోజువారీ మెనూ..
అరటి దవ్వ 125 కిలోలు
పచ్చి గడ్డి 75 కిలోలు
చెరకు 40 కిలోలు
పుచ్చకాయ 10 కిలోలు
రాగి తోప 6 కిలోలు
క్యాటిల్ ఫీడ్ 4 కిలోలు
అరటి పండ్లు 6 కిలోలు
ఆకుకూరలు 4 కిలోలు
కొబ్బరికాయలు 2
బెల్లం పావు కిలో
(తవుడు, ఇతర పదార్థాలతో కలిపి)
పొద్దున లేస్తే పావు టన్ను ఆహారం.. 150 లీటర్ల మంచి నీళ్లు! ఒక్కో గజరాజు ఏటా తిని, తాగేందుకే ఏకంగా రూ.4.30 లక్షల ఖర్చవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా సరే.. ఆ లెక్కలను పక్కనపెట్టి ప్రేమానురాగాలతో వాటి పొట్ట నింపుతున్నారు విశాఖ జూ అధికారులు, దాతలు. ఒకప్పుడు అడవుల్లో రాజసంగా తిరిగిన ఏనుగుల అడుగుల చప్పుడు.. కాలంతో పాటు క్రమంగా తగ్గుతోంది. అడవుల ఆక్రమణల నడుమ గజరాజుల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నాలుగు ఏనుగులకు సురక్షిత అభయారణ్యంగా మారింది. నేడు ‘ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం’ వేళ విశాఖ ‘గజ’నేస్తాల ముచ్చట ఇదీ..
ఆరిలోవ: అరణ్యాల్లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంరక్షణ కూడా సవాలుగా మారింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్న గజరాజులు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వాటి సంఖ్య 250 లోపే ఉండటం గమనార్హం. ఇవి ఎక్కువగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల అడవులలో సంచరిస్తున్నాయి. ఒక్కోసారి ఆహారం కోసం ఇవి గుంపులుగా పంట పొలాల్లోకి చొరబడి భయపెడుతున్నాయి. కానీ విశాఖవాసులకు మాత్రం ఈ గజరాజులు నేస్తాలుగా మారిపోయాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో నాలుగు ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయి.
జూలో ప్రత్యేక సంరక్షణ
జూ పార్కులో లక్ష్మి, సరస్వతి అనే రెండు ఆడ ఏనుగులు, కృష్ణ, రాజు అనే రెండు మగ ఏనుగులు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇద్దరు మావటీలు, ఇద్దరు యానిమల్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. మావటీలు మాట్లాడే భాషను ఏనుగులు గుర్తుపట్టి, వారు చెప్పినట్లు వింటాయి. వీటి కోసం జూలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ‘మోట్’ ఉంది. అందులో రాత్రి వేళల్లో నిద్రించడానికి ‘నైట్ క్రాళ్లు’ నిర్మించారు. ఆరేళ్ల క్రితం వీటి స్నానం కోసం ప్రత్యేకంగా ఒక కొలనును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా అనారోగ్యం వస్తే జూ వెటర్నరీ వైద్యులు మావటీల సమక్షంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా ఈ ఆహారాన్ని అందిస్తారు. జూలో అన్ని జంతువుల కంటే ఏనుగుల పోషణకే అత్యధికంగా ఖర్చవుతుంది. ఒక్కో ఏనుగు ఆహారం, పోషణ నిమిత్తం ఏడాదికి రూ.4.30 లక్షలు ఖర్చవుతోంది. ఇది పెద్ద మొత్తం కావడంతో దాతలను ఆశ్రయించాల్సి వస్తోంది.
స్నానం చేయిస్తున్న మావటి(ఫైల్)


