మహారాణిపేట: గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన శిక్షణ సదస్సులో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025పై అవగాహన పెంచుకుని, క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు. డ్వామా పీడీ నిర్మలా దేవి, ఏపీడీ ఆంజనేయులు చట్టం లక్ష్యాలు, గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి హామీ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ప్రకృతి వనరుల సంరక్షణపై వివరించారు. గ్రామ పంచాయతీలు కుటుంబాల నమోదు, ఉపాధి కార్డుల జారీ, పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. డిజిటల్ అటెండెన్స్, జీఐఎస్ మ్యాపింగ్, జియోట్యాగింగ్, డీబీటీ ద్వారా పారదర్శకత పెంచనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


