స్టైఫండ్ పెంపు సహా డిమాండ్ల సాధనకు నిరవధిక సమ్మె కేజీహెచ్‌లో ఓపీల బహిష్కరణ, పలు శస్త్రచికిత్సలు వాయిదా వైద్యుల కోసం రోగుల పడిగాపులు
కేజీహెచ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న జూనియర్ వైద్యులు
మహారాణిపేట: స్టైఫండ్ పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కేజీహెచ్‌లో ఓపీ సేవలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులకు దూరంగా ఉండటంతో వైద్యుల కోసం రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. పలు విభాగాల్లో శస్త్రచికిత్సలు సైతం వాయిదా పడ్డాయి. కేజీహెచ్‌తోపాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమ్మణి దేవి ఆస్పత్రి, ఈఎన్‌టీ, టీబీ ఆస్పత్రుల్లోనూ జూడోల సమ్మె ప్రభావం కనిపించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలను బహిష్కరిస్తున్నామని, అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతామని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
సమ్మెలో భాగంగా జూడాలు నల్లబ్యాడ్జీలు ధరించి కేజీహెచ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఆంధ్ర మెడికల్ కాలేజీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకుంది. పీజీలు, హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్, డీఎన్‌బీ వైద్య విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సోమవారం అమరావతిలో వైద్య ఆరోగ్యశాఖ, డీఎంఈ తదితర అధికారులతో జరిగిన చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగినట్లు జూడోలు తెలిపారు.
ఓపీలకు బ్రేక్.. ఆపరేషన్లూ వాయిదా
కేజీహెచ్‌లో 26 విభాగాల్లో జరిగే ఓపీ సేవలకు రోజూ సుమారు 1,000 మంది పీజీ వైద్యులు, 500 మంది హౌస్ సర్జన్లు, ఇతర జూనియర్ వైద్యులు సేవలందిస్తుంటారు. వీరంతా సమ్మెలోకి వెళ్లడంతో మంగళవారం ఓపీ విభాగాలు వెలవెలబోయాయి. వైద్యుల కోసం రోగులు, వారి సహాయకులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఓపీలతోపాటు ఆపరేషన్ థియేటర్లపైనా సమ్మె ప్రభావం పడింది. పీజీలు, ఇతర వైద్య విద్యార్థులు విధులకు హాజరుకాకపోవడంతో మంగళవారం పలు శస్త్రచికిత్సలను వాయిదా వేసినట్లు సమాచారం. సాధారణంగా శస్త్రచికిత్సల సమయంలో పీజీ వైద్యులు, జూడాలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. వారు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
జనవరి నుంచే పెరగాల్సిన స్టైఫండ్
పీజీ వైద్యుల స్టైఫండ్ సవరణను ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆంధ్ర మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.రవీందర్ ఆరోపించారు. స్టైఫండ్ సవరణతోపాటు పీజీ, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.చరణ్ డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచకుండా ప్రస్తుతం ఉన్న 62 ఏళ్లనే కొనసాగించాలని, నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకాల్లో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
స్పందన లేకుంటే ఉద్యమం ఉధృతం
స్టైఫండ్ పెంపుతోపాటు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని జూడోలు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సంతృప్తికరమైన నిర్ణయం తీసుకోకపోతే దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ నాయకులు డాక్టర్ శిరాజ్ హెచ్చరించారు. జూనియర్ వైద్యుల హక్కుల పరిరక్షణతోపాటు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయడమే తమ పోరాట లక్ష్యమని స్పష్టం చేశారు.


