మహారాణిపేట: గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవాణా సేవలు అందించే ‘102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి మంగళవారం ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను ఇద్దరు సహాయకులతో ఉచితంగా ఇంటికి చేర్చే పోస్ట్‌నేటల్ డ్రాప్‌బ్యాక్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. విశాఖ జిల్లాకు 16 వాహనాలు కేటాయించగా, కేజీహెచ్‌లో 9, అగనంపూడిలో 2, విక్టోరియా ఆసుపత్రిలో 5 వాహనాలు సేవలందిస్తున్నాయని చెప్పారు. వాహనాల్లో జీపీఎస్, ఎయిర్‌బ్యాగ్‌లు, ఎమర్జెన్సీ అలర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. 2025–26లో 9,988 మంది, 2026–27లో ఇప్పటివరకు 3,274 మంది ఈ సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడించారు.


