సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డ్ (హెచ్‌ఎస్‌ఎల్) సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురాం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్ర తీరప్రాంతాన్ని సముద్ర ఆధారిత ఆర్థికాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సముద్ర రంగ అభివృద్ధి, నౌకా నిర్మాణ సామర్థ్య విస్తరణపై చర్చించారు. మచిలీపట్నం, దుగరాజపట్నంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డుల ఏర్పాటుతో దేశ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలనే అంశంపై చర్చించినట్లు హెచ్‌ఎస్‌ఎల్ తెలిపింది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే నౌకా నిర్మాణం, మరమ్మతులు, అనుబంధ లాజిస్టిక్స్ రంగాల్లో కలిపి రాష్ట్రంలో సుమారు 18 లక్షల పనిదినాల ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని సీఎండీ పేర్కొన్నారు. అలాగే ఫ్యాబ్రికేషన్, అవుట్‌ఫిట్టింగ్ విభాగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లకు పైగా వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో స్థానిక పరిశ్రమలకు గణనీయమైన ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.


