శాటిలైట్‌ మోడల్‌లో విశాఖ రైల్వే హబ్‌ | - | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ మోడల్‌లో విశాఖ రైల్వే హబ్‌

Aug 7 2026 12:38 AM | Updated on Aug 7 2026 12:38 AM

● రూ.300 కోట్లతో స్టేషన్‌ అభివృద్ధి, అవుటర్‌ వెయిటింగ్‌కు చెక్‌ ● విశాఖ–గోపాలపట్నం–సింహాచలం మధ్య 4 లైన్ల విస్తరణ ● 14 ప్లాట్‌ఫామ్‌లతో స్టేషన్‌కు కొత్త రూపు ● జోన్‌ పరిధిలోని రైల్వే యార్డుల్ని ఆధునికీకరిస్తాం ● దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జీఎం సందీప్‌ మాథుర్‌ వెల్లడి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో చోటు

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను 14 ప్లాట్‌ఫామ్‌లతో అత్యాధునిక మెగా స్టేషన్‌గా అభివృద్ధి చేయడంతో పాటు, విశాఖ–సింహాచలం–పెందుర్తి రైల్వే స్టేషన్లను అనుసంధానించే ‘శాటిలైట్‌ మోడల్‌’ను రూపొందించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ తెలిపారు. నగర విస్తరణ అవసరాలకు అనుగుణంగా ప్రధాన స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడం, కొత్త రైళ్లకు మార్గం సుగమం చేయడం ఈ ప్రణాళికల ప్రధాన లక్ష్యమని చెప్పారు. వీఎంఆర్‌డీఏ డెక్‌లోని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ తాత్కాలిక ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు, స్టేబ్లింగ్‌ లైన్లు తగినంత లేకపోవడంతో రద్దీ ఎక్కువగా ఉందని, దీనిని అధిగమించేందుకు సుమారు రూ.300 కోట్లతో స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో అమృత్‌ భారత్‌ స్టేషన్ల పథకం కింద దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, పెందుర్తి స్టేషన్లను కూడా ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. విశాఖ, గోపాలపట్నం, సింహాచలం మధ్య నాలుగు లైన్ల విస్తరణ పూర్తయితే రైళ్ల రాకపోకలు మరింత సులభమవుతాయని, అవుటర్‌ వద్ద రైళ్లు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు.

విశాఖ నుంచి మరిన్ని వందేభారత్‌ రైళ్లు : విశాఖ నుంచి మరిన్ని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కేటాయించాలని రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. విశాఖ–తిరుపతి మధ్య కొత్త రైళ్ల నిర్వహణ ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయని, ట్రాక్‌ల లభ్యత, ఇతర జోన్ల సమన్వయం పూర్తయిన తర్వాత తుది ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఫీల్డ్‌ సర్వేలు కొనసాగుతున్నాయని, అలైన్‌మెంట్‌ ఖరారైన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

దువ్వాడకు కొన్ని సుదూర రైళ్ల మళ్లింపు: విశాఖ ప్రధాన స్టేషన్‌లో సాయంత్రం వేళల్లో తీవ్ర రద్దీ ఉండటంతో, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే కొన్ని సుదూర రైళ్లను దువ్వాడ స్టేషన్‌కు మళ్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇతర జోన్లతో సమన్వయం పూర్తయిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సమయ పాలనపై దృష్టి సారించాం : ప్రయాణికుల భద్రత, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పాత ఐసీఎఫ్‌ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెడుతున్నామని వివరించారు. మరిన్ని ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల కోసం రైల్వే బోర్డును కోరామని చెప్పారు. ఎక్కువ స్టేషన్లలో ఆగడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని గుర్తించి, కొత్త రైళ్ల ద్వారా సమర్థవంతమైన నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

సింగిల్‌ లైన్లన్నీ డబుల్‌ లైన్లుగా మార్పు : సింగిల్‌ లైన్లను దశలవారీగా డబుల్‌ లైన్లుగా మారుస్తున్నామని, సింహాచలంతో పాటు జోన్‌ పరిధిలోని రైల్వే యార్డులను ఆధునికీకరిస్తామని చెప్పారు. గుంతకల్లు–బళ్లారి మార్గంలో క్వాడ్రప్లింగ్‌కు ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టుతో ప్రతిరోజూ నడిచే 30–40 సరుకు రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయని వివరించారు.

సిబ్బంది కొరత ఉన్నా.. దూసుకెళ్తున్నాం : జూన్‌ 1న 400 మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించిన దక్షిణ కోస్తా జోన్‌లో ప్రస్తుతం 600 మంది పనిచేస్తున్నారని, ఇంకా సుమారు 40 శాతం పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నప్పటికీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే రెండు నెలల్లోనే 3 శాతం వృద్ధితో 29.4 మిలియన్ల మంది ప్రయాణించగా, ప్రయాణికుల ఆదాయం 13 శాతం పెరిగి రూ.671 కోట్లకు చేరిందన్నారు. ఇప్పటివరకు 40 మిలియన్‌ టన్నుల సరకు రవాణా జరిగిందని, ఈ ఏడాది 108 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా తాత్కాలిక ప్రభా వం ఉన్నప్పటికీ సరకు రవాణా, ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement