కొడంగల్ రూరల్: ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కొడంగల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు యువసేన ఫ్రెండ్స్ అసోషియేషన్ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం లాంటిదన్నారు.
బొంరాస్‌పేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న కొత్తగూడెంలో జరిగే గిరిజన సభను విజయవంతం చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ కోరారు. శనివారం చలో కొత్తగూడెం సోషల్ మీడియా పత్రాన్ని ఆవిష్కరించారు. గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న సభకు బంజారాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
కుల్కచర్ల: దూరవిద్యా విధానం ద్వారా డిగ్రీ చేయాలనుకునే వారు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని శ్రీ రామలింగేశ్వర డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసి.. అట్టి ధ్రువీకరణ పత్రాలను కుల్కచర్లలోని శ్రీ రామలింగేశ్వర కళాశాలలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9441679846లో సంప్రదించాలన్నారు.
కుల్కచర్ల: చౌడాపూర్, కుల్కచర్ల మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కుల్కచర్ల సెంటర్‌కు అలవేలు, పుట్టపహాడ్‌కు మమత, బండవెల్కిచర్లకు లక్ష్మిదేవి, కుస్మసముద్రంకు ఫరానా బేగం, ముజాహిద్‌పూర్‌కు రవలికను ఎంపిక చేశారు. చౌడాపూర్ మండలం మరికల్ సెంటర్‌కు మాలతి, వీరాపూర్‌కు మహేశ్వరి, చౌడాపూర్‌కు సంధ్య, కొత్తపల్లికి ఎల్లమ్మ, చాకల్‌పల్లికి బొమ్మరాసి మహేశ్వరి ఎంపికయ్యారు. ఆయా కేంద్రాలకు ఆయాలను కూడా నియమించారు.
కేశవరావును కోరిన టఫ్ నాయకులు
కొడంగల్ రూరల్: ఉద్యమకారుల కమిటీ చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావును శనివారం నగరంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టఫ్) చైర్ పర్సన్ విమలక్క అధ్యక్షతన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలయ్యేలా చూడాలని కోరారు. స్పందించిన కేశవరావు నాయకులు అందించిన ప్రతిపాదనలను కమిటీతో చర్చించి అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లాకన్వీనర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా బాధ్యులు కొర్ర పాండు తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్: టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్‌లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్‌నగర్–1 డిపో మేనేజర్ లావణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ వాహన లైసెన్స్ కలిగి, కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోను జత చేసి ఈనెల 8వ తేదీలోపు డిపోలో నేరుగా దరఖాస్తు చేయాలన్నారు.


