డ్రాపౌట్లు తగ్గుతాయి
● ఇంటర్ విద్యార్థులకు ఏడు రకాల సామగ్రి
● సంఖ్య పెంచేందుకుప్రభుత్వం సరికొత్త ఆలోచన
● మొదటి విడతలో బూట్ల పంపిణీ
● ఐదువేల మందికి ప్రయోజనం
దౌల్తాబాద్: జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు వెల్‌కమ్ కిట్ అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వేల రూపాయలు వెచ్చించనుంది. ఇది ఆర్థిక భారమైనా ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదని భావిస్తోంది. పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఏడు రకాల వస్తువులతో కూడిన కిట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో 5వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.
ఒక్కొక్కరికి రూ.4,100 చొప్పున
ప్రతి విద్యార్థికీ సుమారు రూ.4,100 విలువ చేసే వస్తువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. రెండు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, కాలేజీ బ్యాగ్, గుర్తింపు కార్డు, బెల్టు, దాదాపు నోట్‌బుక్స్ అందించనుంది. మొదటి విడతగా బూట్లు పంపిణీ చేశారు.
విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విద్యార్థుల వివరాలు సేకరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రయోజనాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులకు బ్రాండెడ్ కంపెనీ వస్తువులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇంటర్‌లో డ్రాపౌట్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం సరి కొత్త ఆలోచన చేసింది. పదో తరగతి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో పేద విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతీయువకులు చదువు ఆపేస్తున్నారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు చేస్తున్నాం.
– శంకర్‌నాయక్, డీఐఈఓ, వికారాబాద్


