● శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టాలి
● ఆరు నెలల వరకు తల్లిపాలే తాగించాలి
● 7వ తేదీ వరకు వారోత్సవాలు
దుద్యాల్: పుట్టిన బిడ్డకు తొలి ఆహారం, మొదటి టీకా అమ్మపాలే. పిల్లలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడుతాయని వైద్యులు చెబుతున్నారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని సూచిస్తున్నారు. ఆ పాలు తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచే తల్లిపాల ఆవశ్యకత, బిడ్డ పోషణ, ఆరోగ్యంపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. లేనిపోని అపోహలతో బిడ్డను తల్లిపాలకు దూరం చేయరాదంటున్నారు. ఎంత త్వరగా ముర్రుపాలు పడితే శిశువు అంత ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కొడంగల్ సీడీపీఓ సరోజ తెలిపారు. మండలంలో 20 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 10 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. వీరికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని అంగన్‌వాడీ సూపర్ వైజర్లు తెలిపారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ముర్రుపాలలో విటమిన్ – ఏ, – బీ, తగినంత ఐరన్ ఉంటుంది. ఈ పాలు శిశువు జీర్ణశక్తిని పెంచుతాయి. కామెర్లు, విరేచనాల వంటి వ్యాధుల నుంచి బిడ్డను కాపాడతాయి.


