ప్రజాసేవే లక్ష్యం
తిరుపతి రూరల్: రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా ‘రా ఎన్టీఆర్’ సేవా సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయిరూప్ స్పష్టం చేశారు. తమ సంస్థకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. తిరుపతిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘రా ఎన్టీఆర్’ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. పదేళ్ల క్రితం జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఇచ్చిన పిలుపే ‘రా ఎన్టీఆర్’ ఏర్పాటుకు స్ఫూర్తి అని చెప్పారు. గ్రామాల్లో సేవ చేయాలన్న నిర్ణయం ఆ నాడే తీసుకున్నట్టు వివరించారు. ‘సేవతో యువ జాగృతి’ ద్వారా యువతలో సామాజిక చైతన్యం పెంపొందించి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ‘మన ఊరు – మన బాధ్యత‘ ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, రైతు సదస్సులు నిర్వహించడం, ‘ఊరి మాట–పాలకుల దాకా’ కార్యక్రమంతో గ్రామీణ సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఒకటైన వస్తున్నాం.. ఊరువాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్‌ను కలిసే అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.


