యూపీఎస్‌సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

తిరుపతి అర్బన్‌: యూపీఎస్‌సీకి సంబంధించిన సెంట్రల్‌ ఆర్‌మడ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో యూపీఎస్సీ పరీక్షలపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల (వింగ్‌–ఏ), ( వింగ్‌–బీ) రెండు సెంటర్లలో మాత్రమే ఆదివారం పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్‌సీ అబ్జర్వర్‌ నిధిగర్గ్‌ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్‌కు

44 మంది ఎంపిక

– మహిళా వర్సిటీలో రేపు అవార్డుల ప్రదానం

తిరుపతి సిటీ: తిరుపతి జిల్లాలో 2025– 2026 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి అత్యుత్తమ మార్కులు సాధించిన 44 మంది విద్యార్థులను ఇంటర్మీడియట్‌ విద్యామండలి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్‌కు ఎంపిక చేసినట్లు డీఐఈఓ డాక్టర్‌ డీ.గోపాలర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం సత్కరించి షైనింగ్‌ స్టార్స్‌గా గుర్తించనుందని చెప్పారు. ఎంపికై న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం మహిళా వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.20 వేల నగదు బహుమతి, మెడల్‌, ధ్రువపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న 44 మందిలో ఏడుగురు విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు కావడం అభినందనీయమన్నారు.

పరిశోధనలకు ప్రోత్సాహం

తిరుపతి సిటీ: క్వాంటమ్‌ టెక్నాలజీలో పరిశోధలను ప్రోత్సహించి, అభివృద్ధి చేసేందుకు ఎస్వీయూ పెద్ద పీఠ వేస్తుందని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. శనివారం వర్సిటీ సెనేట్‌ హాల్‌లో రూసా ఫేజ్‌ 2, ఎస్వీయూ క్యూఏఐసీ ఆంధ్రప్రదేశ్‌ సైనన్స్‌ సిటీ, అమరావతి క్వాంటం వ్యాలీ సంయుక్తంగా నిర్వహించిన క్వాంటమ్‌ టెక్నాలజీ పై జరిగిన వర్క్‌షాప్‌నకు ఆయన హాజరై పలువురు ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి క్వాంటం వ్యాలీ దార్శనికతకు అనుగుణంగా, క్వాంటం టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధికి వర్సిటీ ప్రధాన కేంద్రంగా మారడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ సిటీ సీఈఓ వెంకటేశ్వర్లు, అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ సలహాదారు డాక్టర్‌ వెంకటస్వామి, రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, రూసా కో–ఆర్డినేటర్‌ ఆచార్య సుచరితతో పాటు సైన్స్‌, ఇంజినీరింగ్‌, ఎంసీఏ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

సర్టిఫికెట్ల జారీ జాప్యం ‘సర్‌’

తిరుపతి అర్బన్‌: విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ జారీ విషయంలో జాప్యం నెలకొంటోంది. 2026–27 విద్యా సంవత్సరం నేపథ్యంలో జూన్‌ నుంచి ఆగస్టు వరకు వివిధ కోర్సుల్లో చేరాల్సిన విద్యార్థులు కులధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ, స్థానికత సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ తదితర యాభై రకాలకు పైగా సర్టిఫికెట్స్‌ను తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు తహసీల్దార్లు సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ) పేరుతో తాము క్షేత్ర స్థాయిలో ఉన్నామంటూ కార్యాలయానికి రావడం మానేశారు. వచ్చినా సర్టిఫికెట్స్‌ జోలికి వెళ్లకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు తాము బిజీగా ఉంటామని, ఆ తర్వాత రావాలని తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement