తిరుపతి అన్నమయ్యసర్కిల్: ‘దేశ వ్యాప్తంగా ఆస్తులను కలిగి ఉన్న శ్రీస్వామి హథీరాంజీ మఠం ఆస్తుల వివరాలు, లావాదేవీలు పక్కాగా ఉండాలి. ఆగస్టులో మళ్లీ వస్తాం. ఆస్తుల వ్యవహారం తెలుస్తాం’ అని నిర్వాహక అధికార పరిపాలన కమిటీ హెచ్చరించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు నియమించిన హథీరాంజీ మఠం పరిపాలన కమిటీ శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠానికి చేరుకుని భూ వ్యవహారాలు, తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించింది. మహంతుగా అర్జున్‌దాస్ బాధ్యతలు చేపట్టకముందు మఠానికి ఉన్న ఆస్తులు, ఎక్కడ ఉన్నాయో, ఏయే సర్వే నెంబర్లలో ఉన్నాయో సమగ్ర సమాచారం అందించాలని పరిపాలన కమిటీ ఆదేశించినట్లు సమాచారం. కమిటీ విచారణకు వస్తుందని తెలిసినా కొంతమంది ఉద్యోగులు విధులకు రాకపోవడంపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది. మఠంకు సంబంధించి తిరుపతికి ఒక నగదు రికార్డు, తిరుమలకు ఒక నగదు రికార్డు పరిపాలనపరంగా నిర్వహిస్తుండగా, తిరుపతికి సంబంధించి గత ఏడాది అక్టోబర్ నుంచి నగదు పుస్తకంలో ఎటువంటి లావాదేవీలు నమోదు జరగలేదనే విషయాన్ని గుర్తించినట్లు తెలిస్తోంది. తిరుమలకు సంబంధించిన ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే నమోదు అయిందనే విషయం పై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చైర్మన్ జస్టిస్ డీవీ రమణ, సభ్యులు తీవ్ర అసంతృప్తి చేసినట్టు సమాచారం. 2006 తర్వాత మఠం భూములకు సంబంధించి లీజు ప్రక్రియ, దాని ద్వారా వచ్చే నగదు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఎన్ని, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి... తదితర వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ భావించింది. నలుగురు సభ్యులతో స్టాప్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీ మఠం లా ఆఫీసర్ కవిత, ఏఈవో కృష్ణారెడ్డి, హెడ్స్‌గా మఠం సిబ్బంది సీతారామయ్య, సుబ్రహ్మణ్యం అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సూచించిన విధంగా నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు రెండో వారంలో ప్రతి ఒక్క ఉద్యోగి రికార్డులతో సిద్ధంగా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చైర్మన్ దుప్పల వెంకటరమణ, సభ్యులు మఠం అధికార సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. కాగా కమిటీ విచారణకు సభ్యునిగా నియమితులైన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర హాజరు కాలేదని తెలిసింది.


