సూళ్లూరుపేట : అంతరిక్షంలోకి వెళ్లడమంటే అద్భుత అనుభవమని భారతీయ వ్యోమగామి శుభాన్ష్‌శుక్లా తెలిపారు. విక్రమ్–1 రాకెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఆయన షార్ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్రహ్మప్రకాష్ హాల్‌లో స్పేస్ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు, షార్ ఉద్యోగుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. శుభాన్ష్‌శుక్లా మాట్లాడుతూ ప్రతి భారతీయ విద్యార్థి ఒక వ్యోమగామి కావాలని, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. అంతరిక్షయాత్ర, ఐఎస్‌ఎస్‌లో ఎదురైన అనుభవాలను వివరిస్తూ.. స్పేస్‌లోకి వెళ్లడమంటే చావు బతుకులు సమస్యే అయినప్పటికీ ఆ అనుభూతి ఎప్పటికీ మరిచిపోలేమని వెల్లడించారు. ఆక్సియం స్పేస్ మిషన్ నుంచి తిరిగొచ్చే సమయంలో అసలు భూమికి చేరుతామా.. లేదా.. అనే సందేహం మాత్రం ఉండేదని తెలిపారు. అయితే స్పేస్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు కారణంగా సురక్షితంగానే వెళతామనే ధైర్య మాత్రం ఉందని వెల్లడించారు. అనంతరం ముఖాముఖిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే శుభాన్ష్‌శుక్లాకు ఇస్రో బాహుబలిగా పేరుపొందిన ఎల్‌వీఎం3 రాకెట్ నమూనాను జ్ఞాపికగా షార్ అధికారులు అందజేశారు.


