ఆశలకు నిబంధన | - | Sakshi
Sakshi News home page

ఆశలకు నిబంధన

Jul 20 2026 1:02 AM | Updated on Jul 20 2026 1:02 AM

శాశ్వత అధ్యాపక పోస్టుల భర్తీకి అడ్డగోలు రూల్స్‌ దరఖాస్తుదారుల్లో 90శాతం మందిపై అనర్హత వేటు లబోదిబోమంటున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు

తిరుపతి సిటీ : యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపక పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో లోగుట్టు బయటపడింది. అడ్డగోలు నిబంధనలతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థుల ఆశలను అడియాశలు చేస్తూ కడుపుకొట్టింది. దారుణంగా కఠిన నిబంధనలు విధించడంలో స్కూటినీ ప్రక్రియలో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సుమారు 90శాతం మందిపై అనర్హత వేటు పడింది.

యూజీసీ పేస్కేల్‌తో మెలిక

అధ్యాపకపోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు పలు నిబంధనలను తెరపైకి తీసుకువచ్చారు. యూజీసీ పేస్కేలుతోపాటు సుమారు 8ఏళ్ల పాటు బోధన అనుభవం ఉంటేనే అధ్యాపక పోస్టులకు అర్హులంటూ మెలిక పెట్టేశారు. దీంతో వేలాది మంది దరఖాస్తులను అనర్హుల జాబితాలో చేర్చారు. ఎస్వీయూలో 1,292 దరఖాస్తులకు గాను 130 దరఖాస్తులను అర్హత జాబితాలో ఉంచి మిగిలిన 1,162 దరఖాస్తులు అనర్హులంటూ తిరస్కరించారు. అలాగే పద్మావతి మహిళావర్సిటీకి సంబంధించి అధ్యాపక పోస్టుల కోసం 370మంది దరఖాస్తు చేసుకోగా అందులో 352 మంది దరఖాస్తులు అనర్హులంటూ తొలగించారు. కుప్పం ద్రవిడ వర్సిటీలోని పోస్టులకు 369 దరఖాస్తులు రాగా అందులో 348 దరఖాస్తులను నిబంధనల పేరుతో తొలగించారు.

దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు

ఎస్వీయూ, మహిళా వర్సిటీ, ద్రవిడ వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్సిటీల్లో 10 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు దాదాపు యూజీసీ పే స్కేల్‌ స్థాయి ఎవరికీ కల్పించలేదు. దీంతో ఎంతో ఆశతో శాశ్వత అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు అందరినీ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఇంత దారుణంగా అడ్డగోలు నిబంధనలు పెట్టి తమ కడుపు కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడిన మరికొందరు అభ్యర్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. యూజీసీ పేస్కేల్‌తో పాటు తగిన అనుభవం ఉన్నా ఏ సబ్జెక్ట్‌లో పీజీ పూర్తి చేసి ఉంటారో అదే సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉన్న వారు మాత్రమే అర్హులని, అనుబంధ సబ్జెక్టులలో పీహెచ్‌డీ చేసిన వారు అనర్హులని మరో నిబంధన విధించి దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. జీఓ నంబర్‌ 20 నిబంధనల ప్రకారం స్కూటినీ నిర్వహించామని చెబుతున్న అధికారులు అన్ని వర్సిటీలలోనూ ఒకే నిబంధనలు వర్తింపజేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అర్హత, అనర్హత జాబితాలోని లోపాలను సరిచేసి కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సేవలను గుర్తించాలని, ఈ మేరకు జాబితాను విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

తండ్రి బాటలోనే తనయుడు లోకేష్‌ నడుస్తున్నారు. చంద్రబాబు వైఖరినే కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో అవి చేస్తాం..

ఇవి చేస్తామని ఊరించి ప్రజలకు టోపీ పెట్టినట్టుగానే.. చినబాబు సైతం ఉద్యోగాల పేరుతో ఊరించి మొండిచేయి చూపుతున్నారు. అందులో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో శాశ్వత అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి వేలాదిమందిలో ఆశలు రేకెత్తించారు. అనంతరం

అడ్డగోలు నిబంధనలు విధించి దరఖాస్తు చేసుకున్నవారిలో 90శాతం మందిని అనర్హులంటూ ముద్ర వేసి తప్పించేశారు. ఇందులో ఏళ్ల తరబడి వర్సిటీల్లో సేవలందిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ప్రధాన బాధితులుగా మారిపోయారు. ఏం చేయాలో తెలియక.. ఎవరికి చెప్పుకోవాలో

అర్థం కాక.. దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement