● ఇప్పుడు క్వారీ లీజు పేరుతో దరఖాస్తులు! ● పట్టించుకోని అటవీశాఖ అధికారులు
పెళ్లకూరు:మండలంలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పెన్నేపల్లి గ్రామంలో సర్వేనం.115లో 150ఎకరాలు, సర్వే నం. 116లో 264, కానూరులో సర్వేనం.91లో 1,088, శిర సనంబేడులో 378, రోసనూరులో సర్వే నం.219లో 365, బంగారంపేటలో సర్వే నం.1లో 362, ఊడిపూడి గ్రామంలో 240, అనకవోలు గ్రామంలో 67 ఎక రాలు మొత్తం 2,914 ఎకరాలతో పాటు 1,663 సోష ల్ ఫారెస్టు భూములు కూడా ఉన్నాయి. ఈ భూము ల్లో జామాయిల్, సరుగుడు, నేరేడు తదితర మొక్కలు పెంచి అటవీ సామర్థ్యం పెంపొందించాల్సి ఉంది.
అనాధీనంగా అటవీ భూములు
ఇక్కడి అటవీ భూములను అనాధీన భూములుగా కొందరు మార్చుకొని లీజు మాటున దోపిడీ చేసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అటవీ భూములను ఇటీవల రీ సర్వేలో సర్వే నం.91–2ఏ సబ్ డివిజన్ చేసుకొని 861.41 ఎకరాలు అటవీ భూములను అనాధీన భూములుగా రికార్డుల్లో పొందుపరచడం విశేషం. పాత రెవెన్యూ రికార్డుల్లో (ఎఫ్‌ఎంబీ) అటవీ భూములుగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలతో కలిసి కొందరు రెవెన్యూ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా అనాధీన భూములుగా మార్పు చేయడంపై స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అప్పుడు అలా.. మరి ఇప్పుడూ..?
2014–18లో కానూరు, పెన్నేపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోవడానికి ఆయా కాలనీల సమీపంలో ఉన్న అటవీ భూముల్లో ముళ్ల పొదలను తొలగించి పెసర, మినుము సాగుచేశారు. దాంతో అప్పటి అటవీశాఖ అధికారులు గిరిజనులకు నోటీసులు జారీ చేసి ఆ భూముల్లో ఉన్న పంటను యంత్రాలతో తొలగించి చదును చేశారు. కానీ ప్రస్తుతం రెండేళ్లుగా అటవీ భూములను అనాధీన భూములుగా మార్చేసినా పట్టించుకొనే నాథుడే లేరు.
నిఘా ఎక్కడ?
వెంకటగిరి ఫారెస్టు రేంజ్ కింద పెళ్లకూరు మండలంలోని అటవీ భూములపై పెళ్లకూరు, దొరవారిసత్రం, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఉంది. కానీ అటవీ భూములను అనాధీన భూములుగా మార్చేసి, లీజు కు దరఖాస్తులు చేసుకుంటున్నా ఇక్కడి అధికారులు తమకు పట్టదన్నట్లు వ్యవహరించడం గమనార్హం.
లీజు కోసం దరఖాస్తులు?
అటవీ భూములను అనాధీన భూములుగా మార్పు చేసుకొని, సంబంధిత భూముల్లో గ్రావెల్ తవ్వకాల కోసం అధికార పార్టీ నేతలు లీజులు కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి అటవీ భూముల్లో పుష్కలంగా గ్రావెల్, ఐరన్‌ఓర్ ఉండడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాబందులు మాదిరి వాలిపోయేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
2008లో ఎన్‌వోసీ మంజూరు
కానూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ భూము ల్లో లీజు కోసం 2008లో అప్పటి తహసీల్దార్ ఎన్‌వోసీ మంజూరు చేశారు.కానీ ఇక్కడి అటవీ భూము లను రీసర్వేలో అనాధీనంగా మార్పులు చేశారు. రాష్ట్ర స్థాయి నేతల నుంచి లీజులకు అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడి భూములన్నీ అటవీ భూములని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించాము. – హరికృష్ణ, తహసీల్దార్ పెళ్లకూరు


