చంద్రగిరి: అంతుపట్టని వ్యాధితో గత కొద్ది రోజులుగా మృత్యువాత పడుతున్న గొర్రెలు, మేకలకు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రత్యేక చికిత్సను అందజేశారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అకాల మరణం.. తల్లడిల్లుతున్న ప్రాణం’ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన చంద్రగిరి ఏడీ ప్రసాద్, కల్‌రోడ్డుపల్లి పశువైద్యాధికారిణి మోనిక యాదవ్‌లు తొండవాడ, శానంబట్ల గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన జీవాలకు తిరుపతి వెటర్నరీలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అది చిటుక వ్యాధిగా గుర్తించినట్లు వారు తెలిపారు. అనంతరం వాటికి ఈటీ, టీటీ టీకాలను కూడా అందజేసినట్లు తెలిపారు. టీకాలు వేసిన 15 రోజుల తర్వాత రోగ నిరోధక శక్తి వస్తుందని, అప్పటి వరకు జీవాలకు లేతగడ్డి పెట్టకూడదని చెప్పారు. అలాగే ప్రతి రోజూ పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రవణాన్ని తాపించాలని, తర్వాత 15 రోజులకు ఈటీ బూస్టర్ టీకాలను అందజేస్తామని తెలిపారు. తొండవాడ, శానంబట్లలోని సుమారు 950 జీవాలకు ఈ టీకాలను అందజేసినట్లు వెల్లడించారు. రైతులు కూడా చిటుకు వ్యాధిపై అవగాహన పెంచుకుని, జీవాలను పరిరక్షించుకోవాలని సూచించారు.
ఫోన్ లేకున్నా ప్రసాదం
శ్రీకాళహస్తి: మొబైల్ ఫోన్ లేకపోయినా శివయ్య ప్రసాదం పొందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల ‘ఫోన్ లేకుంటే శివప్రసాదం లేనట్టే’ శీర్షికన ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనిపై దేవదాయశాఖ స్పందించింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆఫ్‌లైన్‌లో కూడా ప్రసాదం దొరికేలా కౌంటర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఆర్డరు కాపీని ఈవో వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ కొట్టేసాయి సోమవారం విడుదల చేశారు.


