ఏర్పేడు: తిరుపతి ఐఐటీతో నామ్‌టెక్ మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ ఎంవోయూపై సంతకాలు చేశారు. భాగస్వామ్య సహకార పరిశోధన, ఇంజినీరింగ్, అధునాతన తయారీ రంగాలలో ఆవిష్కరణలను బలోపేతం చేసే ఉమ్మడి కార్యక్రమాలను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుందన్నారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లాభాపేక్ష లేని విద్యా కార్యక్రమమైన న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఫౌండేషన్ స్థాపించిన న్యూ ఏజ్ మేకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నామ్‌టెక్) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అవగాహన ఒప్పందం ప్రకారం తిరుపతి ఐఐటీ, నామ్‌టెక్ సంస్థలు విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమల అనుభవం, ఉమ్మడి కార్యాచరణ పరిశోధన ప్రాజెక్టులు, అధ్యాపకుల సామర్థ్యాభివృద్ధి, కన్సల్టెన్సీ అసైన్‌మెంట్లు, ఎగ్జిక్యూటివ్ విద్య, సర్టిఫికేషన్ కార్యక్రమాలతో పరస్పర సహకారం అందించుకుంటాయని తెలిపారు. విక్సిత్ భారత్ 2047, జాతీయ విద్యా విధానం 2020 కింద భారతదేశపు విస్తృత ఆశయాలకు మద్దతుగా, విద్యా, పరిశోధన శిక్షణా వ్యవస్థతో ఏకం చేయడానికి భాగస్వామ్యం దోహదం చేస్తుందన్నారు. ఐదేళ్ల పాటు ఎంవోయూ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ అండ్ అవుట్‌రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కె.తంగిరాల, సెంటర్ ఫర్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ కె.పి.నవీన్, కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ సలహాదారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గోర్తి, రిజిస్ట్రార్ బ్రిగేడియర్ డాక్టర్ కె. పి.కృష్ణ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ రుచిక పాల్గొన్నారు.


