చంద్రగిరి: ఓ హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణాలను లెక్కచేయకుండా బావిలోకి దూకి మహిళను కాపాడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి మండలం, రాయలపురానికి చెందిన ఊహకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లకు భర్తతో విభేదాలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ఊహ శ్రీనివాసమంగాపురంలోని తన అక్క ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తిరుపతి జీవకోనకు చెందిన మల్లికార్జునతో ఊహకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనం వరకు వెళ్లింది. సోమవారం ఊహ, జీవకోనలోని మల్లికార్జున నివాసానికి వెళ్లి తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఆమె ఇబ్బంది పెట్టడంతో మల్లికార్జున తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. మంగళవారం మల్లికార్జున కుటుంబ సభ్యులు శ్రీనివాసమంగాపురానికి చేరుకుని ఊహను మందలించారు. తీవ్ర ఆవేదనకు లోనైన ఊహ ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు తీసింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ చలపతి ఊహతో పాటు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. అయితే ఎంతకీ వినని ఊహ గ్రామ సమీపంలోని ఓ బావిలోకి దూకేసింది. హెడ్‌కానిస్టేబుల్ చలపతి వెంటనే బావిలోకి దూకి ఆమె ప్రాణాలు కాపాడాడు. అనంతరం బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


