బుతుకుతో ఆటలా? | - | Sakshi
Sakshi News home page

బుతుకుతో ఆటలా?

Jul 22 2026 12:30 AM | Updated on Jul 22 2026 12:30 AM

● నాయుడుపేట పట్టణంలో గతంలో లాటరీ జూదానికి బానిసై ఓ లైన్‌మన్‌ రూ.60 లక్షలు అప్పు చేశాడు. ఆపై అప్పు తీర్చలేక ఓజిలి మండలం, కురుగొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న లైన్‌మన్‌ సూసైడ్‌ నోట్‌లో సైతం లాటరీ ఉచ్చులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు పేర్కొన్నాడు. ● ఇటీవల ఓజిలి మండలానికి చెందిన బీటెక్‌ విద్యార్థి ఆన్‌లైన్‌ జూదానికి బానిసయ్యాడు. కళాశాలకు కట్టాల్సిన నగదు జూదానికి కట్టి పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు ఏమి చెప్పాలో తెలియక రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డబ్బుకు ఆశపడి అప్పుల ఊబిలో

కూరుకుపోతున్న పేదలు

.. ఇవి మచ్చుకు కొన్ని ఘటనలు మాత్రమే. నాయుడుపేట పట్టణంతోపాటు సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం ఆన్‌లైన్‌, లాటరీ, సింగిల్‌ నంబర్లాట చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలువురు పేదలు, మధ్యతరగతి ప్రజలు జూదానికి బానిసై బతుకులను సర్వనాశనం చేసుకుంటున్నారు. చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

నాయుడుపేటటౌన్‌: నాయుడుపేట పట్టణంలో లాటరీ, సింగిల్‌ నంబర్లాట ముమ్మరంగా సాగుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పలువురు పేదలు లాటరీ, సింగిల్‌ నంబర్లాట ఆడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కూలీల నుంచి వ్యాపారులు, ఉద్యోగస్తులు సైతం ఈ జూదాలకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. రూ.10 మొదలుకొని వేల రూపాయులు పెడుతూ కాటాన్‌, సింగల్‌ నంబర్లాటలో మునిగితేలుతున్నారు. పట్టణంలో వీధికో ఏజెంట్‌ పెట్టి జూదం నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. సింగిల్‌ నంబర్లాట పట్టణం నుంచి గ్రామాలకు సైతం విస్తరిస్తోంది.

ఎలా జరుగుతోందంటే?

పంట్టణంలో సింగిల్‌ నంబర్లాటతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన లాటరీ టిక్కెట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల లాటరీ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ బడుగు వర్గాలతో పాటు మధ్య తరగతి వారు, పలువురు ఉద్యోగులు సైతం వేలల్లో లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరికి నంబరు మాత్రమే చిన్న పాటి చీటీలో రాసి ఇస్తుంటారు. ఉదయం నుంచి కష్టార్జితంతో కూలి పనులు చేసుకుని వచ్చిన డబ్బులు, జూదరులకు ధారబోస్తున్నారు. రిక్షా కార్మికులు మొదలుకొని వివిధ పనులు చేసే వారు కాయకష్టం చేసే సొమ్మంతా జూదానికే తగలేస్తున్నారు. సింగిల్‌ నంబర్ల జూదంలో రూ.10 పెడితే రూ.750, రూ.20 కడితే రూ.1,500, రూ.100 కడితే రూ.7,500, రూ.1000 కడితే రూ.75 వేలు వస్తాయని ఆశజూపుతున్నారు. లాటరీ టిక్కెట్లు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తున్నారు.

నాయుడుపేటలో విచ్చలవిడిగా లాటరీ, సింగిల్‌ నంబర్లాట

చర్యలు తప్పవు

లాటరీ టిక్కెట్లు, సింగిల్‌ నంబర్ల విక్రేతలపై చట్టపరమైన చర్యలు చేపడుతాం. గతంలో నాయుడుపేటలో పలువురు లాటరీ విక్రేతలపై కేసు నమోదు చేసి ఉన్నారు. లాటరీ, సింగిల్‌ నంబర్ల జూదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలిచ్చాం.

– చెంచుబాబు, డీఎస్పీ, నాయుడుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement