తిరుపతి రూరల్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 258 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్ – 2026’ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి విద్యార్థులకు సరికెట్లు, నగదు బహుమతులను అందించి అభినందించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెల 24న జరిగే పేరెంట్–టీచర్ సమావేశాలకు ప్రతి తల్లిదండ్రి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మార్కులే కొనమానం కాదు
కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అన్నారు. మార్కులే జీవిత విజయానికి కొలమానం కాదన్నారు. పిల్లలను ఇతరులతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ ద్వారా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.20వేల నగదు, మెడల్, ప్రశంసాపత్రాలు అందజేశారు. తిరుపతి, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నెలవల విజయశ్రీ,అరవ శ్రీధర్, డీఈఓ కేవీఎన్ కుమార్, ఆర్‌ఐఓ గోపాల్‌రెడ్డి, రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్, యాదవ, వన్నెకుల క్షత్రియ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.


