విక్రమార్కుడు | - | Sakshi
Sakshi News home page

విక్రమార్కుడు

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

● రోదశీలోకి ఆరు ఉపగ్రహాలు ● షార్‌లో మిన్నంటిన సంబరాలు ● మొదటి దశలోని కలాం–1200 అనే ఘన ఇంధన ఇంజిన్‌తో 1.5 నిమిషాల్లో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. ● కలాం–200 అనే ఘన ఇందన దశతో 3 నిమిషాల్లో రెండో దశ, కలాం–100 అనే ఘన ఇంధనంతోనే మూడో దశను 5 నిమిషాల్లో పూర్తి చేశారు. ● నాలుగోదశ రామన్‌–1 అనే ద్రవ ఇంధన దశతో 9.36 నిమిషాలకు 415 కిలో మీటర్లు ఎత్తులో విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తరువాత నాలుగో దశలోని ట్రిమ్మింగ్‌ మాడ్యూల్‌ 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 15.59 నిమిషాలకు కటాప్‌ ముందుగా గ్రహ స్పేస్‌ అనే సంస్థకు చెందిన సోలారాస్‌ ఉపగ్రహం, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థకు చెందిన స్కోప్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆ తరువాత 17.29 నిమిషాలకు కాస్మోసర్వ్‌ స్పేస్‌ అనే స్టార్టప్‌ అంతరిక్ష సంస్థకి చెందిన ఎంబ్రేస్‌ అనే ఉపగ్రహం, జర్మనీకి చెందిన యూడీ 3 పీపీ అండ్‌ ఎండీ 3 ఆర్‌ఎన్‌ అనే ఉపగ్రహం, కాస్మోస్‌ డైమండ్‌ సంస్థకు చెందిన కాస్మోక్‌బ్లూమ్‌ అనే ఉపగ్రహం, వరంగల్‌కు చెందిన అజయ్‌కుమార్‌ మెట్టవాడ తయారు చేసిన మైక్రో ఆర్ట్‌ ట్రిబ్యూట్‌ అనే కళాత్మక ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంతో ఈ ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు మంత్రి నారా లోకేష్‌, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఇస్రో చైర్మన్లు హాజరయ్యారు.

విక్రమ్‌–1 రాకెట్‌ ప్రయోగం దిగ్విజయం

నింగిలోకి దూసుకెళ్తున్న విక్రమ్‌–1 రాకెట్‌

సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్‌ థవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థకు చెందిన విక్రమ్‌–1 రాకెట్‌ను శనివారం మధ్యాహ్నం 12:05:30 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయ 6 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ప్రయోగ సమయంలో మరో 4.59 నిమిషాలుండగా కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఉన్నట్టుండి ఆగిపోయింది. వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు స్కైరూట్‌ ప్రతినిధులు ఆందోళన చెందారు. ప్రయోగానికి ఐదు నిమిషాల ముందు ఈ చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సవరించుకుని 30 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగాన్ని నిర్వహించారు. రాకెట్‌ ద్వారా ఆరు బుల్లి తరహా ఉపగ్రహాలను రోదశీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇస్రో చరిత్రలో మొట్టమొదటి ప్రయివేట్‌ రాకెట్‌ కాబట్టి ఈ ప్రయోగాన్ని ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.

నాలుగు దశల్లో రాకెట్‌ ప్రయోగం ఇలా..

రాకెట్‌ నాలుగు దశలతో విజయవంతంగా ప్రయోగించారు. మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ ద్రవ ఇంధనంతో ప్రయోగించే విధంగా డిజైన్‌ చేసుకున్నారు. 22 మీటర్లు పొడవు, 1.7 మీటర్ల వెడల్పు కలిగిన రాకెట్‌ ప్రయోగ సమయంలో 1.5 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి నిప్పులు చిమ్ముతూ రివ్వున దూసుకెళ్లింది. మొదటి దశకు కలాం–1,200, రెండో దశకు కలాం–250, మూడో దశకు కలాం–100 దశలను ఘన ఇందనంతో రూపొందించారు. నాలుగో దశలో మోనో మీథైల్‌ హైడ్రోజన్‌ (ఎంఎంహెచ్‌), నైట్రోజన్‌ టెట్రాకై ్సడ్‌ (ఎన్‌టీఓ) శక్తితో పనిచేసే నాలుగు రామన్‌–1 ఇంజిన్‌ల సమూహంతో రూపొందించారు. ఇది మొత్తంగా 3.4 కేఎన్‌ థ్రస్ట్‌ను అందిండంతో 350 కేజీల బరువు కలిగిన ఆరు చిన్న తరహా ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టేందుకు వీలైంది.

దిగ్విజయంగా..

విక్రమ్‌–1 ప్రయోగాన్ని వీక్షించేందుకు విచ్చేసిన విద్యార్థులు

విక్రమ్‌–1 రాకెట్‌ ప్రయోగం దిగ్విజ యంగా పూర్తయ్యింది. మధ్యలో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిలిచిపోయి ఆందోళనలో పడేసింది. మళ్లీ శాస్త్ర వేత్తలు సరిచేసి రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో భారతావని సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా విద్యార్థుల ఈలలు, కేకలు, చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

విద్యార్థుల కోలాహలం

విక్రమ్‌–1 ప్రయోగాన్ని వీక్షించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్స్‌ విద్యార్థులతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు విచ్చేశారు. షార్‌ కేంద్రంలోనే శబరి గిరిజన కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగివైపు వెళుతున్నంత సేపు విద్యార్థులు ఈలలు, చప్పట్లు, కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement