వృద్దురాలిని శ్మశానానికి తీసుకెళ్ళే కార్యక్రమాన్ని చేస్తున్న వలంటీర్(ఫైల్)
రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. వైరస్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఎక్కడ చూసినా రెడ్‌జోన్లు.. నిర్మానుష్యంగా వీధులు.. ఇంట్లో నుంచి బయటకు కదిలే పరిస్థితి లేదు.. ఎవరినైనా తాకాలంటే భయం.. ఇక కరోనా బారిన పడి మరణించినవారికి అంత్యక్రియలకు కూడా ఎవరూ ముందుకురాని దుస్థితి. మృతుల కుటుంబీకులు సాయం కోసం పిలిస్తే సొంత బంధువులు కూడా ముఖం చాటేసే రోజులు. ఆ సమయంలో వలంటీర్లు మొక్కవోని ధైర్యంతో విశేష సేవలందించారు. మృతదేహాలను దగ్గరుండి ఆఖరి మజిలీకి చేర్చారు. అన్నీతామై ఆత్మబంధువులుగా నిలిచారు.
– పలమనేరు
కోవిడ్ సెకెండ్ వేవ్.. మే 2021 లాక్‌డౌన్ అమల్లో ఉంది. పలమనేరు పట్టణంలోని ఆది ఆంధ్రవీధికి చెందిన జమున(50) అ నే మహిళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఓ కుమార్తె మినహా ఇంకెవరూ లేరు. ఓ రోజు హఠాత్తుగా జమున తన ఇంట్లోనే మరణించింది. కుమార్తె తన తల్లి అంత్యక్రియలకు సహకరించమని బంధులను ప్రాధేయపడింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో తల్లడిల్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రంగాపురం వార్డు సచివాలయ వలంటీర్ మైఖేల్ సురేష్ వెంటనే స్పందించాడు. స్థానిక గాంధీనగర్ శ్మశానవాటికకు చెందిన కొందరిని తీసుకువచ్చాడు. మృతురాలి బంధువుల్లో ఇద్దరితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఒప్పించాడు. జమునకు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు. అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు.
జేసీబీలు రాని సమయంలో..
పలమనేరు సమీపంలోని సాయినగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నేత బద్రి కోవిడ్ కారణంగా 2021 మేలో మృతి చెందాడు. అతడి స్వగ్రామం కొలమాసనపల్లెలో అంత్యక్రియ లు నిర్వహించేందుకు కుటుంబీకులు సన్నద్ధమయ్యారు. అయితే ఖననానికి గుంత తవ్వేందుకు జేసీబీ దొరకలేదు. అడిగినంతా ఇస్తామని నచ్చజెప్పినా జేసీబీ నిర్వాహకులు ముందుకు రాలేదు. ఇదే పరిస్థితి సంబార్‌పూర్‌లో ఓ వ్యక్తి కోవిడ్‌తో మృతి చెందితే తలెత్తింది. బ్యాంకర్స్ కాలనీలోనూ ఓ మహిళ మృతి చెందితే ఖననం చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వలంటీర్లే సేవలందించారు. సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మృతులను ఆఖరి మజిలీలకు చేర్చారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించారు.
ఎన్నటికీ మరువలేం
మా ఇంటి పక్కనే ఉన్న జమునమ్మ మృతి చెందింది. ఆమెకు ఓ కుమార్తె మాత్రమే ఉంది. జమునమ్మకు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మా వార్డు వలంటీర్ మైఖేల్ అన్నీతానై వ్యవహరించాడు. సొంత మనుషులు పట్టించుకోకున్నా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మైఖేల్ అందించిన సేవలను ఎన్నటికీ మరువలేం.
– ప్రవళ్లిక, ఆదిఆంధ్ర వీధి, పలమనేరు
కుటుంబీకులుగానే భావిస్తా
నా వార్డు పరిధిలోని 50 కుటుంబాలను నా సొంత కుటుంబీకులుగా భావిస్తా. సేవచేయాలనే ఆలోచనతోనే వలంటీర్‌గా చేరా. డబ్బు సంపాదన కోసం ఇందులోకి రాలేదు. కోవిడ్ సమయంలో మృతదేహాలకు అంత్యక్రియలు చేయలేదంటే తట్టుకోలేక పోయేవాడిని. అందుకే నేనే ప్రత్యేక చొరవ తీసుకుని సేవలందించా. నాకు ఈ తృప్తి చాలు.
– మైఖేల్ సురే‹Ù, వలంటీర్, పలమనేరు
సంబార్‌పూర్‌లో జేసీబీతో గుంత తవ్విస్తున్న వలంటీర్, సచివాలయ సిబ్బంది(ఫైల్)


