రోడ్డు భద్రత అందరి బాధ్యత
రేణిగుంట: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత పేర్కొన్నారు. రేణిగుంట విమానాశ్రయం ఆవరణలో మంగళవారం తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోలీసులకు బ్రీత్ ఎనలైజర్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ 10 జాతీయ రహదారులు, 13 రాష్ట్ర రహదారులు ఉన్నాయని ఏడాదికి సుమారు 1500 రోడ్డు ప్రమాదాలు జరిగి, దాదాపుగా 500 మంది కి పైగా మృతి చెందారన్నారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి చాలా దూరం నుంచి రావడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడంతోపాటు, పలువురు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రాష్ట్రంలో మూడు దశల్లో ప్రణాళికా బద్ధంగా పూర్తిస్థాయిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సేఫ్టీ వెహికల్స్, బ్రీత్ ఎనలైజర్ పరికరాలను పోలీసులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐ లు జయచంద్ర, మంజునాథరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


