ఆర్సీపురంలో ఛత్తీస్‌గఢ్ ఈజీఎస్ బృందం
రామచంద్రాపురం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఉపాధి హామీ ఈజీఎస్ బృందం మంగళవారం రామచంద్రాపురం మండలంలోని పలు పంచాయతీల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఈ ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలువుతున్న ఉపాధి హామీ పనులు, కన్వర్జెన్స్ పనుల తీరును ఆ బృందం సభ్యులు పరిశీలించారు. మిట్టకండ్రిగలోని రైతు చంద్రశేఖర్ పొలంలో ఫారంపాండ్, మునిరత్నం నాయుడు పొలంలో నాటిన మామిడి తోటలను వారు పరిశీలించారు. అనంతరం కందకాల ట్రెంచ్ పనిని, భారతమిట్ట వద్ద పశువుల నీటి తొట్టి నిర్మాణాలను పరిశీలించారు. కుప్పం బాదూరులో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్ పనితీరును బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. గంగిరెడ్డిపల్లె గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం భవనాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. కమ్మకండ్రిగలో కన్వర్జెన్స్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, చంద్రగిరి ఏపీడీ రెడ్డెప్ప, జీఐఎస్ నిపుణులు గుణశేఖర్, ఎంపీడీఓ పులిరాంసింగ్, ఏపీఓ చంద్రశేఖర్ రాజు, ఈసి భాగ్యలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్ గోపి తదితరులు పాల్గొన్నారు.


