జవాబుదారీతనం
‘కరెంటోళ్ల జనబాట’తో
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో మంగళవారం ప్రారంభమైంది. సీఎండీ శివశంకర్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పుట్టావాండ్లపల్లిలో పర్యటించి అక్కడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. వినియోగదారులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడంతో గ్రామస్తులు ఆయన్ని అభినందించారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆ కరెంటోళ్ల జనబాటను నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది నిర్దేశిత గ్రామాల్లో పర్యటించగా 11 కేవీ, ఎల్‌టీ, వ్యవసాయ విద్యుత్ లైన్లను పరిశీలించడం, విద్యుత్ లైనుకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించడం, వాలిపోయిన స్తంభాలను సరి చేయడం, కిందకి వేలాడే విద్యుత్ లైనులను సరి చేయడం, ట్రాన్సఫార్మర్ దిమ్మెల ఎత్తును పెంచడం లేదా కంచెను ఏర్పాటు చేయడం తదితర సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమం మొదటి రోజున డిస్కం పరిధిలోని 9 జిల్లాల్లో మొత్తం 28,672 సమస్యలు అధికారుల దృష్టికి రాగా వాటిలో 507 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు తెలిపారు. మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థపై వినియోగదారులకు నమ్మకం కలిగించడంతో పాటు సమస్యల సత్వర పరిష్కారానికి, విద్యుత్ వినియోగదారులకు అధికారుల నుంచి జవాబుదారీతనం లభిస్తుందని సీఎండీ శివశంకర్ వెల్లడించారు.
పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన
’కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం ద్వారా పీఎం సూ ర్యఘర్ పథకం కింద గృహ వినియోగదారులు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునేందుకు వీలు గా అవగాహన పెంపొందించాలని సూచించారు. తమ గ్రామాలకు విచ్చేసే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి, పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.


