సింహాచలకండ్రిగలో మళ్లీ రాజుకున్న భూవివాదం
ఏర్పేడు: శ్రీకాళహస్తి మండలం మన్నవరం సమీపంలోని సింహాచలకండ్రిగ గ్రామ పరిధిలో ఉన్న రిజర్వ్‌ఫారెస్ట్ భూమిలో స్థానిక రైతులు రెండు రోజులుగా నిమ్మ చెట్లు నాటడంతో అటవీశాఖ అధికారులు విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సింహాచలకండ్రిగ వద్ద సుమారు 170 ఎకరాలు రిజర్వ్‌పారెస్ట్ భూములున్నాయి. అయితే ఈ భూముల్లో 1993లో సింహాచలకండ్రిగకు చెందిన భూముల్లేని నిరుపేదలకు రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. అయితే ఆ భూములు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనివి కావడంతో అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ముఖ్య అనుచరుడొకరు ఈ భూములపై కన్నేసి అటవీశాఖ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చిన పరిస్థితులు కొన్ని నెలల కిందట వెలుగులోకి వచ్చాయి. ఈ భూముల్లో సుమారు 130 ఎకరాల్లో అటవీశాఖ అధికారులు ఎర్రచందనం, మద్ది మొక్కలను నాటారు. దీనిపై స్థానిక రైతులు కోర్టుకు వెళ్లడంతో గత నెలలో హైకోర్టు ఈ భూముపై స్టే విధించింది. అయితే సోమ, మంగళవారాల్లో కొందరు స్థానికులు ఈ భూముల్లో నిమ్మచెట్ల నాటి కంచె ఏర్పాటు చేశారు. ఈ ఘటన గురించి అటవీశాఖాధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలిపారు.


