సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.ముద్రగడ అనారోగ్యం గురించి తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
ఈ సందర్భంగా నాయకులు ఇద్దరూ ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను, ఆరోగ్యం మెరుగుపడుతున్న తీరును అక్కడి వైద్యులను అడిగి ఆరా తీశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే.


